
తెలంగాణలో యాసంగి సీజన్ ప్రారంభంతోనే వ్యవసాయ కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. పొలాల్లో విత్తనాల నుంచి ఎరువుల వరకు అన్ని ఏర్పాట్లతో రైతులు బిజీగా ఉన్నారు. ఈ సమయంలో పెట్టుబడి సాయం కోసం రైతుల చూపు అంతా రైతు భరోసా పథకంపైనే నిలిచింది. ఎప్పుడెప్పుడు రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమ అవుతాయా అనే ఆతృతతో రైతులు ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందన్న అంచనాలు బలంగా ఉండటంతో, పండుగకు ముందే పెట్టుబడి భారం తగ్గుతుందని చాలా మంది ఆశించారు. తొలుత ప్రభుత్వం కూడా సంక్రాంతి నాటికి నిధులు అందించాలని భావించినప్పటికీ, విధానపరమైన మార్పులు ఈ ప్రక్రియను ఆలస్యం చేశాయి.
ప్రస్తుతం రైతు భరోసా పథకాన్ని కేవలం పంట సాగు జరుగుతున్న భూములకు మాత్రమే వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయానికి అనుకూలమైన భూములు, నిజంగా పంటలు వేసిన భూములను గుర్తించేందుకు శాటిలైట్ సర్వేను ఆధారంగా తీసుకుంటోంది. వ్యవసాయ యూనివర్సిటీ సహకారంతో ఈ సర్వే నిర్వహించగా, దానికి సంబంధించిన తుది నివేదిక ఇంకా ప్రభుత్వానికి అందాల్సి ఉంది. ఈ నివేదిక ఆలస్యం కావడంతోనే రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ కూడా జాప్యం అవుతోంది. దీంతో రైతుల్లో కొంత ఆందోళన నెలకొన్నా.. ప్రభుత్వం నుంచి స్పష్టమైన భరోసా రావడంతో ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి.
రైతు భరోసా నిధుల విడుదలపై రాష్ట్ర రైతు కమిషన్ ఛైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి కీలక ప్రకటన చేశారు. జనవరి నెలాఖరుల్లోగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. యాచారం మండల కేంద్రంలో నిర్వహించిన రైతు వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రైతులకు ఎలాంటి భయం అవసరం లేదని తెలిపారు. ఈ నెల చివరినాటికి అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందుతుందని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా రైతులకు త్వరలోనే సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేస్తామని చెప్పారు. నీటి వనరులు తగ్గుతున్న పరిస్థితుల్లో తక్కువ నీటి వినియోగంతో మంచి దిగుబడులు వచ్చే కూరగాయల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. ఈ దిశగా ప్రయోగాత్మకంగా మూడు గ్రామాల్లో కూరగాయల సాగు చేపట్టగా, మంచి ఫలితాలు వచ్చాయని వివరించారు. ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలైతే రైతులకు ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా రైతు భరోసా అందరికీ దక్కుతుందా లేక కొందరికి కట్ అవుతుందా అన్న సందేహాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసినట్లుగా, కేవలం వ్యవసాయానికి అనుకూలంగా ఉండి పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా వర్తిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో అన్ని రకాల భూములకు ఈ పథకం అమలయ్యిందని, అయితే ప్రస్తుత ప్రభుత్వం నిజమైన రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు వెల్లడించారు. వ్యవసాయానికి అనర్హమైన భూములు, పంట సాగు లేని భూములకు రైతు భరోసా నిలిపివేయనున్నట్లు కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో శాటిలైట్ సర్వే ద్వారా గుర్తించిన వివరాల ఆధారంగా అర్హులైన రైతులకు మాత్రమే నిధులు విడుదల చేయనున్నారు.
మొత్తంగా చూస్తే యాసంగి సీజన్ మధ్యలో రైతు భరోసా నిధులపై నెలకొన్న ఉత్కంఠకు జనవరి చివరినాటికి ముగింపు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పెట్టుబడి భారం తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నందున, అర్హులైన రైతులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.





