
సీఎం రేవంత్ రెడ్డి పాలనా తీరుపై ఆయన సొంత టీమ్ నుంచే క్రమంగా విమర్శలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో తనకేం సంబంధమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ప్రకటించడం కాక రేపుతోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఏరికోరి తెచ్చుకుని.. విద్యా కమిషన్ చైర్మెన్ గా నియమించిన మాజీ ఐఏఎస్ అకునూరి మురళీ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.విద్యా శాఖ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీరు సరిగా లేదన్నారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న రేవంత్ రెడ్డి… ఆ శాఖను పూర్తిగా వదిలేశారని విమర్శలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన ఈ శాఖకు ఇంకా ఎక్కువ సమయం ఇవ్వాలి.. ఈ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి టైం ఈజ్ రన్నింగ్ ఔట్.. రెండేళ్లు అయిపోయాయి అప్పుడే.. చివరి సంవత్సరం ఎన్నికలే ఉంటాయి.. కాబట్టి మధ్యలో ఉన్నది రెండేళ్లేనని చెప్పారు.
ఈ ప్రభుత్వం విద్యారంగం కోసం ఇంకా ఎక్కువ సమయం, వనరులు, బడ్జెట్ వెచ్చించాలి. ముఖ్యమంత్రి, అధికారులు ఈ రంగంలో ఇంకా ఎక్కువ పనిచేయాలి. ఈ మధ్య నిర్లక్ష్యం కొంచెం ఎక్కువనే అయ్యింది.. అది కరెక్ట్ కాదు..మధ్యాహ్న భోజనం నాణ్యత లేక పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మధ్యాహ్న భోజనం వండే స్వయం సహాయక గ్రూపుల మహిళలు వాళ్లు స్వంత పైసలు పెట్టుబడి పెట్టి పిల్లలకు వండిపెడుతున్నారు..వారికి రాష్ట్ర ప్రభుత్వం సమయానికి బిల్లులు చెల్లించక అప్పుల పాలవుతున్నారన అకునూరి మురళీ స్పష్టం చేశారు.
వారికి ఎప్పుడో అయిదేళ్ల క్రితం రేట్లు ఇస్తే వారు ఎలా బతకగలుగుతారు? వారికి వారానికొకసారి చెల్లింపులు జరపాలని, మూడు నెలలకు, ఆరు నెలలకు ఇస్తే వారికి ఇబ్బంది అవుతుంది అని మేము సూచించాం.మేము కొన్ని సూచనలతో మూడు నెలల క్రితం విద్యాశాఖకు రిపోర్టు ఇస్తే అస్సలు పట్టించుకోవడం లేదని తెలంగాణ విద్యా కమీషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆరోపించారు.