Uncategorized

అసమ్మతి సెగతో విడదల రజినీ ఉక్కిరిబిక్కిరి..!

Vidadala Rajini : అధికారం పోయినా… తలకెక్కిన పవర్‌ దిగలేదా..? సొంత పార్టీ నుంచే ఆ మాజీ మంత్రికి అసమ్మతి సెగ తప్పడంలేదా..? వ్యతిరేకవర్గం పెడుతున్న పొగకు ఆమె దిమ్మ తిరుగుతోంది…? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి…? అసమ్మతి సెగ రాజుకుంటున్న ఆ నియోజకవర్గం ఏది..?

విడదల రజినీ.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో మంత్రి. ఇప్పుడు మాజీ. పవర్‌ పోయినా.. ఆమె తీరు మారలేదు. మొండితనం తగ్గలేదట. నియోజకవర్గంలోని పార్టీ నేతలను కలుపుకుని పోవాల్సిన ఆమె.. వ్యతిరేకవర్గాన్ని పెంచుకుంటూ పోయిందట. ఇప్పుడు ఆ వ్యతిరేకత మంటలు.. చిలకలూరిపేటను చుట్టేశాయి. అసమ్మతి సెగలై.. విడదల రజినీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు లోకల్‌ టాక్‌.

టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారు విడదల రజినీ. 2019లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ ప్రభుత్వం ఆమెకు కేబినెట్‌లో చోటిచ్చింది. దీంతో.. మంత్రి పీఠం ఎక్కేశారు. పవర్‌ చేతికి రాగానే… విడదల రజినీ పార్టీలో వర్గ రాజకీయాలు మొదలుపెట్టారట. సొంత పార్టీ నేత మర్రి రాజశేఖర్‌ను కూడా ఆమె దూరం పెడుతూ వచ్చారు. దీంతో రాజశేఖర్‌ వర్గమంతా విడదల రజినీకి వ్యతిరేకం వర్గంగా మారిపోయింది. వైసీపీ అధికారంలో ఉన్నంతవరకు ఆమె పప్పులు ఉడికాయి.. రాజశేఖర్‌ వర్గం తగ్గుతూ వచ్చింది. ఆమె నియోజకవర్గాన్ని.. కార్యకర్తలను పెద్దగా పట్టించుకోకపోయినా అప్పట్లో ఎవరూ పెద్దగా నోరుమెదపలేదు. పవర్‌ పోయిన తర్వాత… ఆమెపై ఉన్న వ్యతిరేకత బయటపడుతూ వస్తోందట. ప్రస్తుతం విడదల రజినీ వ్యతిరేక వర్గమంతా ఒక్కటై… ఆమెపై కారాలు, మరియాలు నూరుతున్నారని సమాచారం. అంతేకాదు. ఆత్మీయ సమావేశం పేరుతో సమావేశాలు నిర్వహించి.. ఆమెపై వ్యతిరేకతనూ బయటపెడుతున్నారు. విడదల రజినీ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలతో చిలకలూరిపేటను హోరెత్తిస్తున్నారు. రజినీ వద్దు – జగన్‌ ముద్దు అంటూ ప్లకార్డులు, ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు చిలకూరిపేట నిజయోవర్గంలోని వైసీపీ శ్రేణులు.

2024లో చిలకలూరిపేట నుంచి గుంటూరు వెళ్లి పోటీ చేసిన విడదల రజినీ ఓటమి చవిచూశారు. ఆ తర్వాత.. తిరిగి చిలకలూరిపేటకే వచ్చారు. అప్పుడు కూడా పార్టీలో నేతలు, కార్యకర్తలను కలుపుకుని పోలేదని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఓటమి తర్వాత కూడా ఆమె తీరులో మార్పు రాకపోవడంతో… వ్యతిరేకం బలపడింది. విడదల రజినీపై తిరుగుబావుటా ఎగరేస్తోంది. విడదల రజినీని కొనసాగిస్తే చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ బలపడటం కష్టమే అన్న మాటను అధిష్టానానికి చేరవేస్తుందట. ఆ అసమ్మతి సెగతో విడదల రజినీ ఉక్కిరిబిక్కిరవుతున్నారట. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని అధిష్టానం ప్రశ్నిస్తే.. ఏం చెప్పుకోవాలన్న ఆలోచనలో ఉన్నారట ఆమె. ఇప్పటికైనా మేడం మారతారా…? లేక అదే ఒంటెద్దు పోకడలోనూ ఉంటారా…?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button