![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/02/Screenshot-2025-02-11-085003-780x470.jpg?lossy=1&strip=1&webp=1)
తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఉగ్రరూపం చూపించారు. జనం మధ్యలోనే కమిషనర్ కు ఫోన్ చేశారు. తమాషా చేస్తున్నారా అని ప్రశ్నించారు. హరీష్ రావు ఫోన్ కాల్ తో ఆగమేఘాల మీద ఆయన దగ్గరకు వచ్చారు కమిషనర్. మున్సిపల్ సిబ్బందిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. తమ కోసం అండగా నిలబడిన హరీష్ రావుకు కృతజ్ఞతలు చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు.
రంగారెడ్డి – గండిపేట మండలం కాళీ మందిర్ వద్ద పేదల షాపులను కూలగొడుతున్నారు మున్సిపల్ అధికారులు.
మా ఇండ్లు, దుకాణాలు కూలగొడుతున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అటుగా వెళుతున్న హరీష్ రావు కారుకు అడ్డు వచ్చారు బాధితులు. దీంతో కారు దిగి షాపుల దగ్గరకు వచ్చిన హరీష్ రావు..బుల్‌డోజర్లతో కూలగొడుతున్న మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇండ్లు, దుకాణాలు అకస్మాత్తుగా కూలగొడితే ఎట్ల బతుకుతారు అంటూ మండిపడ్డారు హరీష్ రావు.
బాధితులకు ధైర్యం చెప్పి, అక్కడి నుంచే బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కమిషనర్ తో ఫోన్లో మాట్లాడారు హరీష్ రావు.
ఇప్పటికే హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చారు.. ఇప్పుడు దుకాణాలు కూల్చితే బతుకు దెరువు ఎట్లా అంటూ ప్రశ్నించారు. 20, 30 ఏళ్ల నుండి ఇక్కడి దుకాణాల పైనే ఆధారపడి జీవిస్తున్న వారి ఉపాధి పై దెబ్బకొట్టడం దుర్మార్గం అంటూ మండిపడ్డారు.హరీశ్ రావు నిలదీయడంతో హుటాహుటిన ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు కార్పొరేషన్ కమిషనర్.కూల్చివేతలు నిలిపి వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు మున్సిపల్ సిబ్బంది. దీంతో తమ పక్షాన నిలిచిన హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు స్థానికులు.