
ప్రేమ విఫలమైతే ఎంతటి ప్రమాదకర రూపం దాల్చగలదో కర్నూలు నగరంలో జరిగిన ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. తాను ప్రేమించిన వ్యక్తి మరో మహిళను వివాహం చేసుకున్నాడన్న కోపంతో అతని భార్యపై మాజీ ప్రియురాలు చేసిన దారుణ ప్రయత్నం తీవ్ర కలకలం రేపింది. మహిళా వైద్యురాలికి వైరస్ ఇంజెక్షన్ ఇచ్చిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
కర్నూలుకు చెందిన ఓ వైద్యుడు, ఆదోనికి చెందిన యువతి కొన్నేళ్ల పాటు ప్రేమ సంబంధంలో ఉన్నారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వారి మధ్య విభేదాలు తలెత్తి ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆ వైద్యుడు మరో మహిళా డాక్టర్‌ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె కర్నూలు వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తుండగా, భర్త కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సేవలందిస్తున్నారు.
ఈ వివాహాన్ని జీర్ణించుకోలేకపోయిన మాజీ ప్రియురాలు వారిని విడదీయాలనే ఉద్దేశంతో కుట్ర పన్నినట్లు పోలీసులు నిర్ధారించారు. అందులో భాగంగా ఈ నెల 9వ తేదీన మహిళా వైద్యురాలు విధులు ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు. మార్గమధ్యంలో నలుగురు వ్యక్తులు బైక్‌తో ఆమెను ఢీ కొట్టి కిందపడేలా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఆ తర్వాత ఆమెకు సహాయం చేస్తున్నట్టు నటించిన నిందితులు ఆటోలో ఎక్కించారు. అదే సమయంలో ఆమెకు తెలియకుండా ఓ ప్రమాదకర వైరస్ ఇంజెక్షన్ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనను అత్యంత పద్ధతిగా, ముందస్తు ప్రణాళికతో అమలు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని గమనించిన ఆమె భర్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న కర్నూలు 3వ పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థల పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుల కదలికలను ట్రాక్ చేసి కీలక ఆధారాలు సేకరించారు.
సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల సహాయంతో నిందితులను గుర్తించిన పోలీసులు మాజీ ప్రియురాలితో పాటు ఆమెకు సహకరించిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ వెల్లడించారు.
ALSO READ: గృహ ప్రవేశాలకు శుభ ముహుర్తాలివే!





