
ఎల్బీనగర్, క్రైమ్ మిర్రర్:- ప్రతిఒక్కరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు నాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఎనలేని కృషి చేశారని, ఆయన చేసిన సేవలను నేటితరం యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. సంఘ సంస్కర్త, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం ఎల్బీనగర్ చౌరస్తాలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి రాజ్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అదే విధంగా పూలే విగ్రహం పక్కనే ఉన్న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్, తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి విగ్రహాలకు రాజ్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని భావించి అందరిలో అక్షరాస్యతను పెంపొందించేందుకు తన సతీమణి సావిత్రి భాయి పూలేతో కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే ఎనలేని కృషి చేశారని కొనియాడారు. అదే విధంగా బడుగు, బలహీన వర్గాల బలోపేతానికి ఎంతో శ్రమించారని పేర్కొన్నారు. యువత మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు నడుం బిగించాలని సూచించారు. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా తమ ఫౌండేషన్ పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి, వడ్త్య చిరంజీవి, ఆదిరాల రమేష్, తీగల శ్రీనివాస్, అల్తాఫ్, రవికుమార్, మహేష్ యాదవ్, శివ తదితరులు పాల్గొన్నారు.