
SVSN Varma : ఎస్వీఎస్‌ఎన్ వర్మ… పిఠాపురం మాజీ ఎమ్మెల్యే. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోసం ఆయన మాజీ గానే ఉండిపోయారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో… పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటును త్యాగం చేశారు. అయినా… ఆయనకు తగిన ప్రాధాన్యం దక్కలేదు. ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారు. దీంతో… తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వర్మ. పార్టీ తీరుపై మండిపడుతున్నారు. తన రాజకీయ భవిష్యత్ ఏంటి..? అన్న ఆలోచనలో పడ్డారు. మరోవైపు… ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి…? ఏం చేయబోతున్నారు అన్న చర్చ కూడా జరుగుతోంది.
2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీచేస్తారనేది నామినేషన్ల సమయం వరకు సస్పెన్స్‌లో పెట్టారు. ఆఖరున పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ కోసం వర్మను బుజ్జగించారు. ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయకుండా ఆపారు. ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. అధినేత చెప్పారని వర్మ కూడా సైలెంట్ అయ్యాడు. ఎమ్మెల్సీ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. చంద్రబాబే హామీ ఇచ్చారు కదా.. తనకే టికెట్ ఇస్తారని అనుకున్నారు. కానీ.. చివరి నిమిషంలో అనుకోని షాక్ తగిలింది. నిన్న (ఆదివారం) రాత్రి టీడీపీ ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. అందులో వర్మ పేరు లేదు. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి జనసేనకు ఇవ్వగా… నాలుగు టీడీపీ తీసుకోవాలని అనుకుంది. అలా జరిగుంటే.. వర్మకు అవకాశం వచ్చుండేదేమో తెలీదు. కానీ.. చివరి నిమిషంలో బీజేపీ పేచీ పెట్టింది. జనసేనకు ఇచ్చినట్టే తమకూ ఒక ఎమ్మెల్సీ కావాలని పట్టుబట్టింది. దీంతో.. ఒక స్థానం బీజేపీకి ఇవ్వక తప్పలేదు చంద్రబాబు. దీంతో… వర్మకు అన్యాయం జరిగిపోయింది. ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటి..? అన్నది ప్రశ్నార్థంగా మారింది.
పవన్ కళ్యాణ్… పిఠాపురం నియోజకవర్గాన్ని సొంత నియోజకవర్గం చేసుకుంటున్నారు. అంటే.. ఆయన ఇకపై కూడా పిఠాపురం నుంచే పోటీ చేస్తారని సమాచారం. అలాగే.. టీడీపీతో పొత్తును కూడా కంటిన్యూ చేస్తానని చెప్తున్నారు జనసేనాని. పవన్ ఉండగా పిఠాపురంలో వర్మతో పనేముందని చంద్రబాబు భావిస్తుండొచ్చు. అదే జరిగితే… వర్మకు ఇక ఎమ్మెల్యేగా అవకాశం ఉండదు. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా చేయిజారిపోయింది. దీంతో వర్మ పరిస్థితి అయోమయంగా ఉంది. మరోవైపు.. పవన్ కళ్యాణ్ కూడా తన స్వార్థం చూసుకున్నారు. తన సోదరుడు నాగబాబు కోసం ఆలోచించినంత…. తన కోసం ఎమ్మెల్యే సీటు వదులుకున్న వర్మ గురించి పవన్ కళ్యాణ్ ఆలోచించడం లేదన్న వాదన వినిపిస్తోంది. అంతేకాదు.. పిఠాపురం నియోజకవర్గంలో తనకు తప్ప మరొకరికి అధికారం ఉండకూదన్న ఆలోచన అయినా పవన్‌లో ఉండొచ్చని.. అందుకే వర్మను పక్కనపెట్టి ఉండొచ్చన్న అనుమానాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా… ఇప్పుడు వర్మ తక్షణ కర్తవ్యం ఏంటి…? ఆయన ఏం చేయబోతున్నారో చూడాలి.