
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో : వల్లభనేని వంశీ మూడు నెలల చూస్తున్న ఎదురుచూపులకు తెర పడింది. వంశీపై మొదట నమోదైన కేసులో బెయిల్ మంజూరైంది. కానీ.. మరో కేసులో ఆయనకు ఇంకా రిమాండ్ ఉంది. కనుక.. బెయిల్ వచ్చినా.. వంశీ బయటకు రాలేని పరిస్థితి. మరి.. వంశీకి విడుదల ఎప్పుడు..?
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి.. ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. ఈ కేసులో ఫిబ్రవరి 13న వంశీని అరెస్ట్ చేశారు విజయవాడ పటమట పోలీసులు. అప్పటి నుంచి ఆయన జైల్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో రెండుసార్లు బెయిల్ పిటషన్లను వేసినా కోర్టు కొట్టేసింది. ఎట్టకేలకు మే 13న… సరిగ్గా అరెస్ట్ అయిన మూడు నెలల తర్వాత.. ఈ కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు.
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుతోపాటు.. వంశీపై పాత కేసులు కూడా ఉన్నాయి. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు వంశీ. ఆ తర్వాత గన్నవరం భూకబ్జా కేసు, చెరువను తవ్విన కేసు, భూ ఆక్రమణ కేసు… ఇలా వరుసగా గన్నవరం, ఆత్కూరు, నూజివీడు, హనుమాన్ జంక్షన్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్న పెండింగ్ కేసులపై పీటీ వారెంట్లు దాఖలు చేశారు పోలీసులు. ఈ అన్నీ కేసుల్లో వంశీకి హైకోర్టు, సెషన్స్ కోర్టులో బెయిల్ లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు ఉండగా.. వీటిలో కూడా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మే 13న బెయిల్ వచ్చింది. ఇక.. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు ఉంది. ఈ కేసులో మే 21 వరకు వంశీకి రిమాండ్ ఉంది. ఈ కేసులో కూడా బెయిల్ వస్తే.. వల్లభనేని వంశీకి జైలు నుంచి విముక్తి లభించి.. ఆయన విడుదలయ్యే అవకాశం ఉంటుంది.
మరోవైపు.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు వంశీ. ఈ విషయాన్ని నిన్న (మే 13న) కోర్టులో న్యాయమూర్తికి చెప్పారు. దీంతో… ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయమూర్తి ఆదేశించారు. నిన్న (మే 13న) వంశీకి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మూడు గంటల పాటు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఊపిరితిత్తుల సమస్యతో పాటు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వైద్యులు గమనించినట్టు సమాచారం.