తెలంగాణ

ముత్యాలమ్మ గుడికి వెళ్లకుండా ఈటల రాజేందర్ హౌజ్ అరెస్ట్

మల్కాజ్ గిరి ఎంపీ, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయానికి వెళ్లకుండా ఆయనను ఇంటిలో దిగ్భందించారు. ఈటల రాజేందర్ ఇంటి నుంచి బయటికి రాకుండా.. ఆయన నివాసం దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. షామీర్ పేట- పూడూర్ లో ఈటల రాజేందర్ ఇల్లు తెల్లవారుజాము నుంచే పోలీస్ పహారాలో ఉంది. ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు.. ఈటల రాజేందర్ బయటికి రాకుండా చూడటంతో పాటు ఆయన ఇంట్లోకి బీజేపీ కార్యకర్తలను ఎవరినీ పోనియడం లేదు.

ముత్యాలమ్మ దేవాలయ విగ్రహం ధ్వంసానికి నిరసనగా ఉజ్జయిని మహంకాళి దేవాలయం నుండి ముత్యాలమ్మ దేవాలయం వరకు ర్యాలీకి హిందూ సంఘాలు సిద్ధమయ్యాయ. అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని భజరంగ్ దళ్ పిలుపిచ్చింది. ఈ ర్యాలీకి వెళ్లకుండా ఎంపీ ఈటల రాజేందర్ ను పోలీసులు ఇంటి వద్దే అడ్డుకుంటున్నారు. విగ్రహం ధ్వంసం అయిన ఆలయం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే పరిధిలోకి వస్తుంది. ఇది మల్కాజ్ గిరి ఎంపీ పరిధిలో ఉంటుంది. దీంతో స్థానిక ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ ను ముత్యాలమ్మ గుడికి వెళ్లకుండా అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఉజ్జయిని మహంకాళి దేవాలయం నుండి ముత్యాలమ్మ దేవాలయం వరకు ర్యాలీ తీసి తీరుతామని హిందూ సంఘాలు చెబుతున్నాయి.

సికింద్రాబాద్‌లో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనకు నిరసనగా హిందూ సంఘాలు ఇచ్చిన పిలుపుతో షాపులేవీ తెరుచుకోలేదు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బందును పాటిస్తున్నారు. ముందస్తు చర్యగా పోలీసులు బందోబస్తు పాటిస్తున్నారు. అటు ముత్యాలమ్మ ఆలయం వద్ద పోలీస్ పికెటింగ్ నిర్వహిస్తున్నారు.

Back to top button