
రామకృష్ణాపూర్,క్రైమ్ మిర్రర్:-మందమర్రి ఏరియాలోని ఆర్కే–1ఏ అటవీ ప్రాంతం భక్తి పారవశ్యంతో పులకించిపోయింది. సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహించిన సమ్మక్క–సారలమ్మ జాతర నేటితో ముగియనుంది. శనివారం సాయంత్రం అమ్మవార్లు తిరిగి వన ప్రవేశం చేయడంతో జాతర వేడుకలకు తెరపడనుంది. గత మూడు రోజులుగా మందమర్రి, రామకృష్ణాపూర్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు జాతరకు తరలివచ్చారు. అటవీ ప్రాంతమంతా ‘జై సమ్మక్క.. జై జై సారలమ్మ’ నామస్మరణతో మారుమోగింది. భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తుల సౌకర్యార్థం సింగరేణి సంస్థ విస్తృత ఏర్పాట్లు చేసింది. తాగునీరు, విద్యుత్ దీపాలు, పారిశుధ్య సదుపాయాలతో పాటు భద్రతా చర్యలను సింగరేణి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.జాతర ప్రాంగణంలో గిరిజన సంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులు తమ ఇష్టదైవాలకు బంగారం సమర్పించి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. జాతర చివరి రోజైన నేడు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, సాయంత్రం వైభవంగా వన ప్రవేశం చేయించనున్నారు. దీంతో మూడు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో సాగిన సమ్మక్క–సారలమ్మ జాతర నేటితో ఘనంగా ముగియనుంది.
Read also : కారు, బుల్లెట్ బైక్ నడపడం రాదని భర్తను వదిలేసిన భార్య.. అంతటితో ఆగకుండా..
Read also : Medaram: లేడి ఐపీఎస్ డ్యాన్స్ వైరల్.. నెజిజన్లు ఫిదా





