Encounter In J&K: జమ్ము కాశ్మీర్ లో మళ్లీ అలజడి మొదలయ్యింది. కథువా జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం నుంచి భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన జైష్ ఎ మహమ్మద్ ఉగ్రవాదులు కథువా జిల్లా బిల్లావర్ ప్రాంతంలో సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఆర్మీ, సీఆర్పీపీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీస్ ప్రత్యేక బృందం సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం నజోట్ అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు కొనసాగుతున్నాయి.
ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు అనుమానం
నజోట్ అటవీ ప్రాంతంలో ఇద్దరు లేదంటే ముగ్గురు ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ముఖ్యంగా జైష్ ఎ మహమ్మద్ సంస్థకు చెందిన కమాండర్ ఉన్నట్లు సమాచారం. అయితే.. దీనిపై భద్రతా బలగాలు ఇంతవరకూ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటివరకు ఇరువైపుల నుంచి ఎవరికీ గాయాలు, ప్రాణ హాని జరగలేదని భద్రతా దళాలు వెల్లడించాయి. గత వారం కూడా.. కహోగ్ అటవీ ప్రాంతంలో భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య కాల్పుల ఘటన జరిగింది. చీకట్లో ఉగ్రవాదులు కొండప్రాంతాలను ఆసరాగా చేసుకుని తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత రెండో అలజడి
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ఉగ్రవాదుల చొరబాట్లు కొంత కాలం పాటు నిలిచిపోయాయి. మళ్లీ ఇప్పుడిప్పుడే పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడ్డంతో పాటు ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నిస్తున్నారు. రీసెంట్ గా పాక్ డ్రోన్లు ఎల్వోసీ దగ్గరికి రావడంతో భద్రతా బలగాలు వాటిని పేల్చేశాయి. గత గురువారం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. మొత్తంగా మళ్లీ తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.





