Elon Musk On India: అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ భారత్ పై ప్రంశసలు కురిపించారు. భారత్ నుంచి అమెరికా పొందుతున్న మేథో మేలు గురించి కీలక విషయాలు వెల్లడించారు. అదే సమయంలో తన కుటుంబానికి భారత్ తో ఉన్న సంబంధాల గురించి చెప్పుకొచ్చారు. జిరోదా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్ కాస్ట్ లో ఎలన్ మస్క్ మాట్లాడారు. తన వ్యక్తిగత జీవితం గురించి, తన భార్య గురించి, పిల్లల గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.
నా భార్యకు భారతీయ మూలాలు, నా కొడుకు శేఖర్
భారత్ లో అద్భుతమైన మేథో సంపత్తి ఉందని చెప్పారు ఎలన్ మస్క్. తన భార్య శివోన్ జిలిస్ కు భారతీయ మూలాలు ఉన్నాయన్నారు. “నా భార్య శివోన్ జిలిస్‌కు భారతీయ మూలాలు ఉన్నాయి. ఆమెను చిన్న వయసులోనే దత్తత ఇచ్చారు. ఆమె కెనడాలో పెరిగింది. భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ అంటే నాకు చాలా గౌరవం. ఆ గౌరవం తోనే నా కొడుకు పేరులో శేఖర్ అనే పదాన్ని పెట్టాను” అని ఎలన్ మస్క్ చెప్పారు. యేల్ యూనివర్సిటీలో చదువుకున్న శివోన్ జిలిస్.. 2017లో మస్క్ ఆధ్వర్యంలోని న్యూరాలింక్ ప్రాజెక్ట్ లో చేరారు. ఆ సమయంలో మస్క్, శివోన్ దగ్గరయ్యారు. సహజీవనం ప్రారంభించారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు.
భారత్ తో అమెరికాకు ఎన్నో ప్రయోజనాలు
అటు అమెరికా వలస విధానం, ట్రంప్ కఠిన నిర్ణయాల గురించి మస్క్ కీలక విషయాలు వెల్లడించారు. అద్భుతమైన ప్రతిభ గల భారతీయులను ఉద్యోగులుగా నియమించుకుని అమెరికా చాలా ప్రయోజనాలు పొందిందదన్నారు. వలసలు, హెచ్1బీ వీసాల విషయంలో ట్రంప్ కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రస్తుత తరుణంలో మస్క్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అదే సమయంలో అమెరికా భారత్ విషయంలో చేస్తున్న టారిఫ్ యుద్ధం పైగా చర్చకు కారణం అవుతున్నాయి.





