
Elephant and Dragon Unite: భారత్, చైనా స్నేహితులుగా ఉండటమే సరైన ఎంపిక అని.. సరిహద్దు సమస్యలు ఇరుదేశాల బంధాలను ప్రభావితం చేయవద్దని ప్రధాని మోడీతో జిన్ పింగ్ అన్నారు. ఇరుగుపొరుగు దేశాలుగా, ఒకరి విజయానికి మరొకరు తోడ్పడే భాగస్వాములుగా ఉండాలన్నారు. డ్రాగన్, ఏనుగు కలసి నృత్యం చేయాలని వ్యాఖ్యానించారు. భారత్, చైనా ప్రత్యర్థులు కావని, సహకార భాగస్వాములని అభివర్ణించారు.
ట్రంప్ నిర్ణయాలపై ఆగ్రహం
ట్రంప్ ఏకపక్ష విధానాలను పరోక్షంగా విమర్శిస్తూ.. అంతర్జాతీయ సంబంధాల్లో మరింత ప్రజాస్వామ్యం కోసం, ఆసియాలో, ప్రపంచంలో శాంతిని నెలకొల్పేందుకు భారత్, చైనా కలసి పని చేయాలని జిన్ పింగ్ ఆకాంక్షించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కల్లోల పరిస్థితులు నెలకొన్నాయని, శతాబ్దానికోసారి జరిగే మార్పులు వస్తున్నాయని చెప్పారు.
సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం ముఖ్యం
భారత్-చైనా సంబంధాలు బలోపేతం కావాలంటే సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం ఎంతో ముఖ్యమని మోడీ స్పష్టం చేశారు. పరస్పర నమ్మకం, గౌరవం ఆధారంగా ఇరుదేశాల సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉందని వివరించారు. భారత్, చైనా వ్యూహాత్మక స్వావలంబన పొందిన దేశాలని, ఈ రెండింటి మధ్య సంబంధాలను మూడో దేశం కోణంలో చూడొద్దని భేటీలో స్పష్టం చేశారు. భారత్, చైనా మధ్య సహకారం 280 కోట్ల మంది ప్రయోజనాలకు సంబంధించినదని.. ఇది ప్రపంచ మానవాళి సంక్షేమానికి మార్గం వేస్తుందని పేర్కొన్నారు.
బ్రిక్స్ సదస్సుకు రావాలని జిన్ పింగ్ కు ఆహ్వానం
అటు ఎస్‌ఈవోకు చైనా అధ్యక్షత వహించడం, టియాంజిన్‌లో సదస్సు నిర్వహణపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు రావాల్సిందిగా షీ జిన్ పింగ్ ను ఆహ్వానించారు. ఈ పర్యటనలో భాగంగా చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు కాయ్ ఖితో కూడా ప్రధాని మోడీ సమావేశం అయ్యారు.