
క్రైమ్ మిర్రర్, సంస్థాన్ నారాయణపురం, నల్గొండ జిల్లా : ఆత్మకూర్ (యం), మోత్కూర్, గుండాల మండలాల విద్యుత్ శాఖ అధికారులు తమ విధులను మరిచి మద్యం విందులో పాల్గొన్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటు మూడు మండలాలకు చెందిన అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈలు), మోత్కూర్ ఎడిఈతో పాటు ఇతర అధికారులు గురువారం విధులకు డుమ్మా కొట్టి చౌటుప్పల్ సమీపంలోని సరళ మైసమ్మ దేవాలయ ప్రాంగణంలోని PRR ఫంక్షన్ హాల్‌లో ఓ విందులో పాల్గొన్నారు. ఈ విందును విద్యుత్ శాఖకు చెందిన కాంట్రాక్టర్లు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇందులో పలువురు అధికారులు మద్యం సేవించి, తందనాలు ఆడి హల్లాబుల్లా చేసినట్లు తెలుస్తోంది.
వారు విధులకు హాజరుకాలేదని ప్రశ్నించినప్పుడు, తమకు భువనగిరిలో మీటింగ్ ఉందని కార్యాలయ సిబ్బందిని చెప్పించారని తెలుస్తోంది. కానీ భువనగిరి SE కార్యాలయాన్ని సంప్రదించగా, ఏమీ మీటింగ్ లేదని స్పష్టత ఇచ్చారు. దీంతో అసలు కథ బయటపడింది. విద్యుత్ కార్యాలయాల వద్ద కాళీ కుర్చీలు, తాళం వేసిన గదులు చూసిన స్థానికులు అనుమానంతో ముమ్మరంగా వెతికారు. చివరకు PRR ఫంక్షన్ హాల్లో దావత్ జరుగుతుండగా వారు పట్టుబడినట్లు సమాచారం. విషయం బయటపడటంతో అక్కడున్న అధికారులు హడావుడిగా విందును వదిలేసి పారిపోయినట్టు చెబుతున్నారు.
చర్యలు తీసుకోవాలంటూ స్థానికుల డిమాండ్
ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రజా సేవలో ఉండాల్సిన అధికారులు విధులను విస్మరించి, తాగునీటి విందులకు వెళ్లడాన్ని ఖండించారు. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.