
Election Commission Of India: బీహార్ లో ఓటర్ల జాబితా సవరణ గురించి రచ్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఓట్ల జాబితాను సవరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆగష్టు నుంచి ఈ సవరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
బీహార్ ఎన్నికల జాబితా సవరణపై తీవ్ర దుమారం
త్వరలో బీహార్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సవరించాలని నిర్ణయిచింది. ఈ సవరణపై పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరింది. అయితే, దేశ అత్యున్నత న్యాయస్థానం ఓటర్ల జాబితా సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే.. ఈసీకి కొన్ని సూచనలు చేసింది. వాటి ప్రకారం ఈ జాబితాను సవరించాలని చెప్పింది. బీహార్ తర్వాత ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ జరగనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు రెడీ అవుతున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘం అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. ఓటర్ల జాబితా వసరణకు సంబంధించి పూర్తి స్థాయి షెడ్యూల్ ని త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.