
Donald Trump: భారత్- అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు మొదలుకానున్న నేపథ్యంలో పెద్ద రాజకీయ, ఆర్థిక చర్చలకు దారితీసే కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. భారతదేశం నుంచి అమెరికా మార్కెట్‌కు వెళ్లే బియ్యంపై అదనపు సుంకాలు విధించాలన్న ఆలోచనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశీలిస్తున్నట్లు తాజా సమాచారం. అక్కడి రైతులు విదేశాల నుంచి వచ్చే చౌక బియ్యం తమ మార్కెట్లను దెబ్బతీస్తోందని ప్రభుత్వానికి ఫిర్యాదులు తెలియజేయడంతో ఈ ప్రతిపాదన చర్చకు వచ్చింది.
వైట్‌హౌస్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో 12 బిలియన్ డాలర్ల రైతు ఉపశమన ప్యాకేజీపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. పలు దేశాలు అమెరికా బియ్యం మార్కెట్‌లోకి తీవ్రమైన డంపింగ్ చేస్తున్నాయన్న ఆరోపణలను ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. రైతులు కూడా ఈ సమావేశంలో సబ్సిడీతో వచ్చే దిగుమతి బియ్యం దేశీయ ధరలను తగ్గిస్తోందని, రైతు ఆదాయాన్ని ప్రభావితం చేస్తోందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
రైతుల వాదనలపై స్పందించిన ట్రంప్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అదనపు సుంకాల విధింపు అవసరమేనన్న సంకేతాలు ఇచ్చారు. కెనడా నుంచి దిగుమతయ్యే ఎరువుల సమస్యను కూడా ఈ సందర్భంలో గుర్తుచేశారు.
ఈ సమావేశంలో రైస్ మిల్ సీఈఓ మెరిల్ కెన్నెడీ మాట్లాడుతూ.. అమెరికా మార్కెట్లోకి భారీగా బియ్యాన్ని పంపుతున్న దేశాల్లో భారత్, థాయ్‌లాండ్, చైనా ప్రధానమని పేర్కొన్నారు. ప్యూర్టోరికో మార్కెట్‌లో కూడా చైనా బియ్యం విపరీతంగా ప్రవేశిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా తామే అందిస్తున్న మార్కెట్‌ను ఇప్పుడు ఇతర దేశాలు ఆక్రమించాయని తెలిపారు.
ఇక, అమెరికా రైతుల పంటలకు నష్టం కలిగించే దేశాల జాబితాను రూపొందించాలని ట్రంప్.. వాణిజ్య కార్యదర్శి స్కాట్ బెసెంట్‌కు ఆదేశించారు. దీనికి స్పందించిన బెసెంట్.. భారత్, థాయ్‌లాండ్, చైనా వంటి దేశాలు ఈ జాబితాలో ముందుండే అవకాశం ఉందన్నారు. పూర్తి జాబితా త్వరలో సమర్పిస్తామని తెలిపారు.
ఇలాంటి కీలక పరిణామాల మధ్య భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలు డిసెంబర్ 10న న్యూఢిల్లీలో జరగనున్నాయి. అమెరికా డిప్యూటీ ట్రేడ్ రిప్రెజెంటేటివ్ రిక్ స్విట్జర్ నేతృత్వంలోని బృందం భారత్‌కు రానుంది. భారత్ తరఫున వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ చర్చల్లో పాల్గొననున్నారు. ఈ కీలక చర్చల ముందు ట్రంప్, బియ్యంపై అదనపు సుంకాల ఆలోచన బయటకు రావడం అంతర్జాతీయంగా కూడా దృష్టిని ఆకర్షిస్తోంది.
ALSO READ: Rajashekar: టాలీవుడ్ హీరోకు తీవ్రగాయాలు.. 3 గంటల పాటు సర్జరీ





