
సంక్రాంతి అంటే తెలుగు ఇళ్లలో ఒక ప్రత్యేకమైన ఉత్సవ వాతావరణం కనిపిస్తుంది. ఇంటి ముందర రంగురంగుల ముగ్గులు, వాకిట్లో పండుగ సందడి, వంటింట్లో పిండి వంటల సువాసనలు, బంధువుల కలయికతో ఈ పండుగ ఒక సంపూర్ణ ఆనందంగా మారుతుంది. ఈ సందర్భంలో మరో ముఖ్యమైన ఆకర్షణ గాలిపటాలు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఆకాశం వైపు చూస్తూ పంతంగులు ఎగరేస్తూ పండుగ ఉత్సాహాన్ని ఆస్వాదిస్తారు.
సంక్రాంతి పండుగకు గాలిపటాలు ఎందుకు అంతగా అనుసంధానమయ్యాయన్న ప్రశ్న చాలా మందికి వస్తుంది. ఇది కేవలం వినోదం కోసమేనా లేక దీని వెనుక మరింత లోతైన అర్థం ఉందా అనే సందేహం సహజం. వాస్తవానికి గాలిపటాలు ఎగరేయడం వెనుక సంప్రదాయం, శాస్త్రీయ కారణాలు, పురాణ విశ్వాసాలు, ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ కలిసి ఉన్నాయి.
సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఈ మార్పు భారతీయ సంస్కృతిలో అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఉత్తరాయణం ప్రారంభమవడం అంటే మంచి కాలం మొదలైనట్టుగా నమ్మకం. సూర్యుడిని ప్రత్యక్ష దేవుడిగా పూజించే సంప్రదాయం ఉన్నందున, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆకాశం వైపు గాలిపటాలను ఎగరేస్తారని విశ్వాసం.
పురాణ కథనాల ప్రకారం.. ఉత్తరాయణం ప్రారంభమైన రోజున దేవతలు మళ్లీ చైతన్యవంతులు అవుతారని చెబుతారు. అలాంటి శుభ సమయంలో దేవతలను ఆహ్వానించే సంకేతంగా పతంగులు ఎగరేయడం ఆనవాయితీగా మారింది. కొన్ని కథల ప్రకారం శ్రీరాముడు సంక్రాంతి రోజున తన సోదరులు, హనుమంతుడితో కలిసి గాలిపటాలు ఎగరేశాడని చెప్పుకుంటారు. ఈ కథలు ఈ సంప్రదాయానికి మరింత ప్రాముఖ్యతను తీసుకొచ్చాయి.
గాలిపటాలు ఎగరేయడం ఆనందంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతారు. సంక్రాంతి సమయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ మృదువుగా ఉంటుంది. ఈ సమయంలో బయట ఉండటం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డి సహజంగా లభిస్తుంది. ఇది ఎముకల బలాన్ని పెంచడంతో పాటు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
పంతంగులు ఎగరేయడం వల్ల చేతులు, భుజాలు, కాళ్లు కదలడంతో శరీరానికి తేలికపాటి వ్యాయామం లభిస్తుంది. రక్తప్రసరణ మెరుగవుతుంది. అలాగే కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి బహిరంగ వాతావరణంలో గడపడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది. ఇది పండుగ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.
చరిత్రను పరిశీలిస్తే గాలిపటాల ప్రయాణం వేల సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. సుమారు 2 వేల సంవత్సరాల క్రితం గాలిపటాలు మొదట ఉపయోగంలోకి వచ్చాయని అధ్యయనాలు చెబుతున్నాయి. భారతదేశంతో పాటు గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో సంక్రాంతి సమయంలో గాలిపటాల పండుగలు ఘనంగా జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ గ్రామాల నుంచి పట్టణాల వరకు సంక్రాంతి వస్తే ఆకాశం అంతా రంగురంగుల పంతంగులతో నిండిపోతుంది.
ALSO READ: Shocking: అమ్మాయికి రెండు ప్రైవేట్ పార్ట్స్





