
మన దేశంలో ఊబకాయం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. బరువు పెరుగుతామన్న భయంతో చాలా మంది రాత్రి భోజనంలో అన్నాన్ని పూర్తిగా మానేస్తున్నారు. అన్నం బదులు చపాతీలు, సలాడ్లు, ఇతర డైట్ ఆహారాలను తీసుకుంటూ బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఆశించిన ఫలితం రాకపోవడంతో నిరాశ చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఇదే సమయంలో ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యవంతమైన ప్రజలుగా పేరొందిన జపాన్ ప్రజల ఆహారపు అలవాట్లు పూర్తిగా భిన్నంగా కనిపిస్తాయి.
జపాన్ ప్రజలు రోజుకు మూడు పూటలా అన్నమే తింటారు. అయినా కూడా వారిలో ఊబకాయం సమస్య చాలా తక్కువ. నాజూగ్గా, చురుకుగా, ఆరోగ్యంగా ఉండటంలో వారు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మూడు పూటలా రైస్ తింటూ కూడా బరువు పెరగకుండా ఎలా ఉంటారు అనే ప్రశ్నకు సమాధానం వారి ఆహార విధానం, జీవనశైలిలోనే దాగి ఉంది.
భారతదేశంలో చాలా మందికి అన్నం అంటే పరిమితి అనే మాటే తెలియదు. కూరన్నం, సాంబారన్నం, పెరుగన్నం అంటూ ఒక భోజనంలోనే అన్ని రకాల అన్నాలను కలిపి తినేస్తారు. ఇక బిర్యానీ ప్రేమికులైతే చికెన్ ఫ్రై పీస్, దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ అంటూ పెద్ద ప్లేట్లను పూర్తిగా ఖాళీ చేస్తారు. ఈ అధిక పరిమాణంలో తినే అలవాటు వల్లే అన్నం తినే వారిలో బరువు వేగంగా పెరుగుతోందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
జపాన్ ప్రజలు అన్నాన్ని ఎప్పుడూ మితంగా తింటారు. అక్కడ అన్నం వండుకునేందుకు ఉపయోగించే రైస్ బౌల్ సైజ్ చాలా చిన్నది. సాధారణంగా జపాన్ ప్రజలు ఉపయోగించే రైస్ బౌల్‌లో సుమారు 140 గ్రాముల అన్నమే ఉంటుంది. ఈ పరిమాణం వల్ల శరీరానికి అవసరమైన శక్తి మాత్రమే లభిస్తుంది. దాంతో అనవసరమైన క్యాలరీలు శరీరంలో నిల్వ ఉండవు.
ఇంకొక ముఖ్యమైన అలవాటు ఏమిటంటే జపాన్ ప్రజలు భోజనం చేసే ముందు మూడు పూటలా సూప్ తాగుతారు. సూప్ తాగడం వల్ల కడుపు కొంత నిండిపోతుంది. దీంతో అన్నం ఎక్కువగా తినాల్సిన అవసరం ఉండదు. ఇది అతిగా తినకుండా నియంత్రించే సహజమైన మార్గంగా పనిచేస్తుంది. ఈ చిన్న అలవాటే ఊబకాయం నుంచి వారిని దూరంగా ఉంచుతోంది.
జపాన్ ప్రజలు స్నాక్స్, జంక్ ఫుడ్‌ను చాలా అరుదుగా మాత్రమే తీసుకుంటారు. భోజనం మధ్యలో తినే ఫాస్ట్ ఫుడ్, మిఠాయిలు, చిప్స్ లాంటి ఆహారాలు బరువు పెరగడానికి ప్రధాన కారణమని వారు బాగా తెలుసుకున్నారు. అందుకే రోజువారీ ఆహారంలో తాజా పదార్థాలకే ప్రాధాన్యత ఇస్తారు.
వ్యాయామం విషయంలో కూడా జపాన్ ప్రజలు ప్రత్యేకంగా జిమ్‌లపై ఆధారపడరు. వారి దైనందిన జీవితంలో నడకకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కార్యాలయాలకు, మార్కెట్లకు, చిన్న పనులకైనా ఎక్కువగా నడిచే వెళ్తారు. ఈ కాలి నడకే శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా సహజంగా కరిగించేస్తుంది.
అందుకే జపాన్ ప్రజలకు అన్నం తింటే కార్బోహైడ్రేట్లు పెరుగుతాయన్న భయం ఉండదు. అన్నం శత్రువు కాదని, దాన్ని ఎంత మోతాదులో తింటామన్నదే ముఖ్యమని వారు నమ్ముతారు. మోతాదుకు మించి తినడమే ఊబకాయానికి కారణమని వైద్య నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. అన్నాన్ని పూర్తిగా మానేయడం కాదు, మితంగా తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విషయాన్ని జపాన్ ప్రజల జీవనశైలి మనకు నేర్పిస్తోంది.
ALSO READ: సమయాన్ని వృధా చేస్తున్నారా? ఇది మీ కళ్లు తెరిపిస్తుంది!





