
మరికొద్ది గంటల్లో 2025 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోనుంది. మరోవైపు 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ప్రతి దేశం, ప్రతి నగరం నూతన సంవత్సరం వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నా.. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒకే సమయంలో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ సంబరాలు చేసుకోరన్న విషయం చాలా మందికి తెలియదు. భూమి తన అక్షంపై తిరుగుతున్న క్రమంలో సూర్యోదయం ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో జరిగే విధంగానే, నూతన సంవత్సర ఆరంభం కూడా ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు సమయాల్లో జరుగుతుంది.
ఈ భౌగోళిక ప్రత్యేకత కారణంగా ప్రపంచంలోనే నూతన సంవత్సరాన్ని ముందుగా స్వాగతించే ప్రాంతాలు కొన్ని ఉంటే, చివరగా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టే ప్రాంతాలు మరికొన్ని ఉంటాయి. అసలు ప్రపంచంలో అందరికంటే ముందుగా కేక్ కట్ చేసేది ఎక్కడ? చివరగా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకునేది ఎవరు? అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలోనే ముందుగా నూతన సంవత్సరాన్ని స్వాగతించే ప్రాంతం కిరితిమతి ద్వీపం. దీనినే క్రిస్మస్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న కిరిబాటి దేశానికి చెందిన ఈ ద్వీపం ప్రపంచ పటంలో అత్యంత తూర్పు దిశలో ఉంటుంది. సుమారు లక్ష ఇరవై వేల మంది నివసించే ఈ ద్వీపంలో పారిస్, లండన్, పోలాండ్ వంటి ఆసక్తికరమైన గ్రామ పేర్లు ఉండడం విశేషం. ప్రపంచంలోని చాలా దేశాలు ఇంకా డిసెంబర్ 31 రాత్రి పనుల్లో ఉండగానే, ఇక్కడ అర్థరాత్రి 12 గంటలు దాటి 2026 నూతన సంవత్సరం మొదలవుతుంది.
కిరితిమతి తర్వాత నూతన సంవత్సరం న్యూజిలాండ్‌ను పలకరిస్తుంది. ముఖ్యంగా న్యూజిలాండ్‌లోని చాథమ్ దీవుల్లో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3 గంటల 45 నిమిషాలకే 2026 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఆక్లాండ్, వెల్లింగ్టన్ వంటి ప్రధాన నగరాల్లో సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు నూతన సంవత్సర వేడుకలు మొదలవుతాయి. ఇక్కడి ప్రజలు బాణసంచా, సంగీత కార్యక్రమాలతో కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలుకుతారు.
ఆస్ట్రేలియాలో నూతన సంవత్సరం సంబరాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచాయి. సిడ్నీలోని హార్బర్ బ్రిడ్జ్ వద్ద జరిగే బాణసంచా ప్రదర్శనను ప్రపంచమంతా ఆసక్తిగా తిలకిస్తుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు సిడ్నీలో నూతన సంవత్సరం మొదలవుతుంది. మెల్‌బోర్న్, అడిలైడ్ వంటి నగరాల్లో కూడా దాదాపు ఇదే సమయంలో వేడుకలు జరుగుతాయి.
ఇక, భారత్‌లో డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గంటలకు నూతన సంవత్సరం సంబరాలు మొదలవుతాయి. ఈ సమయానికి జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలు ఇప్పటికే కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టి తమ వేడుకలను ముగించుకుంటాయి. భారత్ తర్వాత ఐరోపా ఖండంలోని లండన్, పారిస్ వంటి నగరాలు నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తాయి. అక్కడి చారిత్రక గడియార స్థూపాల వద్ద జరిగే కౌంట్‌డౌన్ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
అంతేకాదు, ప్రపంచంలో చివరగా నూతన సంవత్సరాన్ని స్వాగతించే ప్రాంతం కూడా ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న అమెరికన్ సమోవా ప్రపంచంలోనే చివరగా కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తుంది. ఇది UTC-11 టైమ్ జోన్‌లో ఉండడం వల్ల, ప్రపంచంలోని చాలా దేశాలు జనవరి 1 వేడుకల్లో మునిగిపోయిన సమయంలో కూడా ఇక్కడ డిసెంబర్ 31 కొనసాగుతూనే ఉంటుంది. భారత కాలమానం ప్రకారం జనవరి 1 సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు అమెరికన్ సమోవాలో అర్థరాత్రి 12 గంటలు అవుతుంది. అంటే మనం లంచ్ పూర్తిచేసే సమయానికి వారు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటారు.
ఇలా కాలం ఒకటే అయినా.. భూమి భ్రమణం కారణంగా నూతన సంవత్సరం ప్రపంచాన్ని చుట్టేస్తూ ముందుకు సాగుతుంది. కిరితిమతి ద్వీపంలో మొదలైన 2026 ప్రయాణం, అమెరికన్ సమోవాలో ముగుస్తుంది. ఈ భూమి గడియారమే మనకు ప్రతి ఏడాది ఈ ఆసక్తికరమైన అనుభూతిని అందిస్తోంది.
ALSO READ: జనవరి 1న ప్రభుత్వ సెలవు.. క్లారిటీ?





