
ఇప్పటి తరం ఫాస్ట్ ఫుడ్, ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్‌ల వైపు పరుగులు పెడుతున్న సమయంలో.. ఒకప్పుడు మన పూర్వికులు పాటించిన ఆహార అలవాట్లు ఎంత గొప్పవో ఇప్పుడు మళ్లీ అర్థమవుతోంది. సుమారు 25 సంవత్సరాల క్రితం వరకూ ముఖ్యంగా పల్లెటూర్లలో ఉదయం టిఫిన్ అంటే చద్దన్నమే ప్రధానంగా ఉండేది. రాత్రి మిగిలిన అన్నంలో పెరుగు కలిపి, ఉల్లిపాయ, పచ్చి మిరపకాయ లేదా ఏదైనా పచ్చడితో నంజు పెట్టుకుని తినేవారు. అప్పట్లో ఇది టైం సేవింగ్ కోసమో, అన్నం వృథా కాకూడన్న ఉద్దేశంతోనో చేసిన పని. కానీ కాలం గడిచేకొద్దీ శాస్త్రీయంగా పరిశీలిస్తే.. అదే చద్దన్నం అమృతంతో సమానమైన ఆరోగ్య రహస్యాల గనిగా తేలింది.
పల్లెల్లో ఇప్పటికీ కొందరు ఉదయాన్నే చద్దన్నం తింటూనే ఉన్నారు. వారి ఆరోగ్యం, శక్తి, పని సామర్థ్యం చూసిన తర్వాతే ఇప్పుడు పట్టణాల్లోని యువత కూడా చద్దన్నం వైపు మళ్లుతోంది. సహజంగా ఫెర్మెంట్ అయ్యే ఈ ఆహారం శరీరానికి అందించే మేలు గురించి తెలిసిన తర్వాత, ఇది పేదల ఆహారం కాదు.. ఆరోగ్యాన్ని కాపాడే సంపూర్ణ భోజనం అని చాలా మంది గుర్తిస్తున్నారు.
చద్దన్నం పులిసినప్పుడు అందులో సహజంగా లాక్టోబాసిల్లస్ అనే మంచిబ్యాక్టీరియా పెరుగుతుంది. ఇవి జీర్ణవ్యవస్థను చురుకుగా ఉంచి, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందువల్ల తిన్న ఆహారం సులభంగా జీర్ణమై, గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. ఈ కారణంగానే పూర్వీకులు పొద్దున్నే చద్దన్నం తినేవారు.
ఎండాకాలంలో శరీరం వేడెక్కి నీటి లోపం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయంలో చద్దన్నం శరీరానికి సహజమైన చల్లదనాన్ని అందిస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడంతో పాటు, డీహైడ్రేషన్‌ను కూడా తగ్గిస్తుంది. అందుకే వేసవిలో చద్దన్నం తినడం చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
చద్దన్నం పులియడం వల్ల అందులో ఉన్న పోషకాలు శరీరానికి మరింత సులభంగా అందుతాయి. ముఖ్యంగా విటమిన్ బి12 వంటి కీలక పోషకాలు ఇందులో సహజంగా ఏర్పడతాయి. ఇవి శరీరంలో శక్తి ఉత్పత్తికి, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఎంతో అవసరం. అలసట, నీరసం తగ్గి రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు చద్దన్నం సహకరిస్తుంది.
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. చద్దన్నం క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్ నిల్వలు తగ్గే అవకాశం ఉంటుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడి, హార్ట్ అటాక్ వంటి ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది.
చద్దన్నంలో ఉండే సహజ యాసిడిటీ, ఫెర్మెంటేషన్ లక్షణాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తరచూ జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఎదుర్కొనే వారికి ఇది మంచి ఆహారం. శరీరం వ్యాధులను ఎదుర్కొనే శక్తిని పెంపొందించడంలో చద్దన్నం కీలక పాత్ర పోషిస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. చద్దన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచదు. అందువల్ల మధుమేహం ఉన్నవారు కూడా భయపడకుండా పరిమితంగా చద్దన్నం తీసుకోవచ్చు.
తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండే ఈ చద్దన్నం నిజానికి మన పూర్వీకులు అందించిన సహజమైన ఇమ్యూనిటీ బూస్టర్. ఆధునిక సప్లిమెంట్స్, ఖరీదైన డైట్స్ కన్నా ఇది ఎంతో మేలు చేస్తుందని ఇప్పుడు వైద్య నిపుణులూ చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో చద్దన్నాన్ని చేర్చుకుంటే, ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా సంప్రదాయ జీవనశైలిని కూడా కాపాడుకున్నవారమవుతాం.
ALSO READ: ఇవాళ వసంత పంచమి.. ఈ పనులు అస్సలు చేయకండి





