
మర్రిగూడ, క్రైమ్ మిర్రర్: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని వట్టిపల్లి గ్రామంలో అక్రమంగా చేపట్టిన ఇంటి నిర్మాణంపై జిల్లా లెవెల్ ప్లానింగ్ ఆఫీసర్ (డిఎల్పీఓ) శంకర్ నాయక్ విచారణ ప్రారంభించారు. గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడంతో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు స్పందించారు.
గత కొంతకాలంగా తండ్రి-కొడుకుల మధ్య జరుగుతున్న ఈ భూ వివాదంలో గ్రామపంచాయతీ మౌలిక సదుపాయాలు, ఇంటి ట్యాక్స్ వసూళ్లపై అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి విచారణ కొనసాగింది. ఎంపీవో రవి కుమార్, గ్రామపంచాయతీ కార్యదర్శి వంశీకృష్ణ సమక్షంలో ఇరుపక్షాల వాదనలు ఆలకించారు.
అక్రమ నిర్మాణానికి పంచాయతీ ఎలా అనుమతులు మంజూరు చేసిందో, పన్ను వసూలు ఎలా జరుపుతున్నారన్న దానిపై డిఎల్పీఓ నిఖిలంగా పరిశీలిస్తున్నారు. సంబంధిత పత్రాలను పరిశీలించిన తర్వాత తుది నివేదికను సిద్ధం చేయనున్నారు.
గ్రామస్థుల అభిప్రాయం మేరకు, శంకర్ నాయక్ నివేదిక ఆధారంగా ఈ వివాదానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఫిర్యాదుదారుడు శ్రీనివాస్ రెడ్డి ‘నిర్మాణాన్ని తక్షణమే కూల్చివేయాలి’ అనే డిమాండ్‌తో ముందుకొచ్చినట్టు సమాచారం.