దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. అందులో హిమాచల్ ప్రదేశ్ చిన్న రాష్ట్రం. ఇక మిగిలింది తెలంగాణ, కర్ణాటకే. తెలంగాణలో బోటాబోటీ మెజార్టీతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక మిగిలిన కర్నాటకలో కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తోంది. అప్పుడే అక్కడ ముసలం మొదలైంది. ముఖ్యమంత్రి పదవి కోసం ఇద్దరు నేతలు కత్తులు దూస్తున్నారని.. క్యాంపు రాజకీయాలకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది. సీఎం కుర్చీ కోసం కర్ణాటకలో మొదలైన కొట్లాట ఎటు వైపు దారి తీస్తుందోనన్న ఆందోళన కాంగ్రెస్ హైకమాండ్ ను కలవరపెడుతోంది.
2023లో ఆరంభంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి విజయం సాధించింది. ఫలితాల తర్వాత సీఎం పదవి కోసం కేపీసీసీ చీఫ్ డికె శివకుమార్, సిద్ధరామయ్య మధ్య గట్టి పోటీ జరిగింది. ఇద్దరు నేతలతో చర్చలు జరిపిన హైకమాండ్ సిద్ధరామయ్య కు సీఎం కుర్చీ అప్పజెప్పింది.అయితే అప్పుడే ఇద్దరు నేతల మధ్య రాజీ ఫార్మూలా జరిగిందనే టాక్ వస్తోంది. మొదటి రెండేళ్లు సిద్దరామయ్య.. తర్వాత మూడేళ్లు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉండేలా చర్చలు జరిగాయంటున్నారు. ఇప్పుడు సిద్దరామయ్య రెండేళ్ల గడువు ముగియడంతో సీఎం సీటు కోసం డీకే శివకుమార్ పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.
ఇపుడు లేటెస్ట్ గా, కర్నాటక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ సీఎం కుర్చీ ఎక్కబోతున్నారనే వార్తలు రాజకీయ దుమారం లేపాయి. చాలా మంది ఎమ్మెల్యేలను డీకే తన గుప్పిట్లో పెట్టుకున్నారని సమచారం. మీడియాతో మాత్రం ఆయన హైకమాండ్ చెప్పినట్టే నడుచుకుంటాం అని చెప్పారు. కానీ కర్నాటక లో తెరవెనుక రాజకీయ పరిణామాలు చాలా వేగంగా ముందుకు కదులుతున్నాయి అని, తెలంగాణ కు చెందిన నేతలు కూడా డీకే సీఎం కుర్చీ ఎక్కేందుకు కావలసిన మంతనాలు జరుపుతున్నారని సమచారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… డీకే శివకుమార్ కు మద్దతు ఇస్తున్నారని తెలుస్తోంది.