
Divorce Trends: భారతదేశంలో ఐటీ రంగానికి ప్రధాన కేంద్రంగా నిలిచిన హైదరాబాద్ నగరం రోజురోజుకూ అభివృద్ధి పథంలో వేగంగా దూసుకెళ్తోంది. ఈ అభివృద్ధితో పాటు యువత జీవనశైలిలో కూడా భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కెరీర్ పురోగతి, ఉన్నత విద్య, వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత పెరగడం, తమ పూర్తి స్థాయి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలనే తపన యువతలో మరింతగా పెరుగుతోంది. కానీ ఈ ఆధునిక జీవన మార్పుల ప్రభావం వ్యక్తిగత బంధాలపై ప్రతికూలంగా పడుతోంది. ముఖ్యంగా వివాహ బంధం, కుటుంబ సంబంధాలు, పరస్పర అవగాహన వంటి విలువలు బలహీనపడుతున్నాయి. ఫలితంగా హైదరాబాద్‌లో విడాకుల రేటు గణనీయంగా పెరుగుతోంది.
నగరంలోని ఫ్యామిలీ కోర్టుల్లో ప్రతి నెలా 250కి పైగా కేసులు నమోదవుతుండటం సమాజంలో ఆందోళన కలిగించే అంశంగా మారింది. వీటిలో ఎక్కువగా 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల జంటలే ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. ఆశ్చర్యకరంగా, వివాహమైన ఏడాది కూడా పూర్తికాకముందే 15కిపైగా కేసులు నమోదు అవుతున్నాయి. కుటుంబాలు నిర్మించబడకముందే విరిగిపోవడం బాధాకర విషయం.
పరిశీలించిన గణాంకాలు రెండు దశాబ్దాలలో విడాకుల రేటు రెట్టింపు అయ్యిందని స్పష్టం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా విడాకుల మొత్తం రేటు కేవలం 1 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, మెట్రో నగరాల్లో అది 30 నుంచి 40 శాతం వరకు పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో విడాకుల రేటు 6.7 శాతంగా ఉండటం, దేశంలో అత్యధిక విడాకులు నమోదయ్యే ఏడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలవడం కూడా నగర జీవనశైలిలో జరుగుతున్న మార్పులకు సంకేతం. పురానీ హవేలీ, కూకట్ పల్లి కోర్టుల్లో ప్రస్తుతం వేలాది కేసులు పెండింగ్‌లో ఉండటం సమాజం ఎదుర్కోక తప్పని వాస్తవాన్ని తెలియజేస్తోంది.
విడాకులకు ప్రధాన కారణాలు ఏమిటి?
ఆధునికత పెరగడం, ఆలోచనల్లో స్వాతంత్ర్యం రావడం పాజిటివ్ అయినప్పటికీ బంధాల బలహీనతకు ఇవే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. దంపతులు ఒకరితో ఒకరు సమస్యలను పంచుకోవడం తగ్గిపోవడం వల్ల అపార్థాలు పెరుగుతున్నాయి. ఐటీ, కార్పొరేట్ ఉద్యోగాల ఒత్తిళ్లు, షిఫ్ట్ వ్యవస్థ, ఆర్థిక ఒత్తిడులు కూడా పెళ్లి జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. విడాకుల కేసుల్లో సుమారు 67 శాతం ఆర్థిక వివాదాలే ప్రధాన కారణమవుతుండగా, పురుషుల్లో 42 శాతం మంది భరణం చెల్లించేందుకు అప్పులు చేస్తున్నారని రికార్డులు చెబుతున్నాయి.
మహిళల విద్య, ఉద్యోగాల్లో ఎదుగుదల, ఆర్థిక స్వావలంబన కూడా నిర్ణయాల్లో ధైర్యాన్ని తీసుకొచ్చాయి. పెళ్లి జీవితంలో తగ్గాల్సిన పరిస్థితి వస్తే తగ్గకూడదనే భావన పెరిగింది. సహనం, సర్దుబాటు విలువలు క్రమంగా తగ్గిపోవడం కూడా బంధాల మధ్య దూరాన్ని పెంచుతున్న అంశం. అలాగే సోషల్ మీడియా, విదేశీ సంస్కృతి ప్రభావం కూడా ఆధునిక వివాహాల్లో విభేధాలకు దారితీస్తున్నాయి.
బంధాన్ని ఎలా కాపాడుకోవచ్చు?
వివాహ బంధం విరగకుండా ఉండేందుకు నిపుణులు ముందస్తు సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఫ్యామిలీ కోర్టుల్లో నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా 70 శాతం కేసులు పరిష్కారమవుతున్నాయి. ఇదే చూస్తే, కౌన్సెలింగ్ ఎంత ప్రభావవంతమో అర్థమవుతుంది. పెళ్లికి ముందే కౌన్సెలింగ్ తీసుకోవడం, ఒకరి ఆలోచనలను మరొకరు అర్థం చేసుకోవడం చాలా అవసరం. చిన్న సమస్యలను కోర్టు వరకు తీసుకెళ్లకుండా మాటల ద్వారా పరిష్కరించుకోవడం, పరస్పర భావాలను పంచుకోవడం, ఒకరికొకరు సమయం కేటాయించడం వంటి చర్యలు బంధాన్ని మరింత బలపరుస్తాయి.
ALSO READ: Delhi High Alert: మరోసారి కోర్టుకు, స్కూళ్లకు బాంబు బెదిరింపులు





