తెలంగాణ

సరస్వతీ పుష్కరాల్లో పోటెత్తిన భక్తులు

– ముగింపు దశకు చేరుకున్న సరస్వతీ పుష్కరాలు
– ముగింపు దశకు చేరుకోవడంతో పెరిగిన భక్తుల తాకిడి
– పుష్కర ఘాటు వద్ద కిక్కిరిసిన భక్తులు
– భక్త జనసంద్రంగా మారిన త్రివేణి సంగమం

క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ :-
కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు భక్తులు బారులు తీరుతున్నారు. భక్తజనం పుణ్యస్నానాలతో త్రివేణి సంగమం కిటికిటలాడుతోంది. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే లక్షన్నర మంది భక్తులు కాళేశ్వరానికి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. పుష్కరాలు ముగింపు దశకు చేరుకోవడంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది

భక్త జనసంద్రంగా మారిన త్రివేణి సంగమం

కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. భక్తుల పుణ్య స్నానాలతో త్రివేణీ సంగమం భక్త జన సంద్రంగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పుష్కర ఘాట్‌లకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు సుమారు కోటిన్నర మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారని అధికారులు వెల్లడించారు. భక్తులు సరస్వతి నదిలో పుణ్య స్నానాలు చేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. నడవలేని స్ధితిలో ఉన్న వృద్ధులు సైతం వచ్చి పుష్కర స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

దూర ప్రాంత భక్తుల కోసం టెంట్​సిటీ

దూర ప్రాంతాల నుంచి భక్తుల కోసం ప్రత్యేకంగా టెంట్ సిటీ ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ తాత్కాలిక వసతి గృహాలకు భక్తుల నుంచి మంచి డిమాండ్ ఉంది. 3 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 41 టెంట్‌లను ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు తెలిపారు. టెంట్ సిటికి మరో వైపు ఫుడ్ కోర్ట్‌ను ఏర్పాటు చేశారు. టెంట్‌ను యాత్ర డాట్ కాం ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. అంతే కాకుండా ఒంటరిగా వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా డార్మెటరీ సదుపాయం కల్పించారు. అధునాతన వసతులతో ఏర్పాటు చేసిన వసతి గృహాలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సోమవారంతో ముగియనున్న సరస్వతీ పుష్కరాలు

సరస్వతి ఘాట్‌లో సాయంత్రం జరుగుతున్న కాశీ పండితుల సరస్వతీ నవరత్న మాల హారతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జోరువర్షాన్ని సైతం లెక్కచేయకుండా హారతిని భక్తులు కనులారా వీక్షించి తన్మయత్వం చెందుతున్నారు. సోమవారంతో సరస్వతి పుష్కరాలు ముగియనున్నాయి. వారంతాలు కూడా కలసి రావడంతో భక్తుల తాకిడి పెరుగుతోంది. త్రివేణీ సంగమ పరిసరాలు ఈ మూడు రోజులు జనసంద్రంగా మారనున్నాయి. దీంతో ఘాట్ పరసరాల్లో అదనంగా వాహనపార్కింగ్ స్థలాలను అధికారులు సిద్ధం చేశారు. చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులతో సమీక్షించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా నిరంతరం పోలీసు గస్తీ పెంచారు. భక్తులెవరూ నది లోపలికి వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పెంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button