
Dermatology Tips: సాధారణంగా మనం పరిశుభ్రత కోసం ప్రతిరోజూ స్నానం చేయడం అలవాటుగా చేసుకుంటాం. అయితే ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. రోజూ స్నానం చేయడం శరీరానికి పరిశుభ్రత ఇస్తే, చర్మానికి మాత్రం కొన్ని ప్రతికూల ప్రభావాలు కలిగించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా డెర్మటాలజిస్టులు, అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ, మయో క్లినిక్ పరిశోధకులు తెలిపిన దాని ప్రకారం.. స్నానం ఎక్కువసార్లు చేయడం చర్మ సహజ రక్షణ పొరను దెబ్బతీయడమే కాకుండా, చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన సహజ నూనెలను తగ్గిస్తుంది. ఈ నూనెలు తొలగిపోయినప్పుడు చర్మం పొడిగా మారి, రాపిడి భావం, చికాకు, ఎర్రబడడం, పగుళ్లు వంటి సమస్యలు ఏర్పడతాయి.
ప్రతిరోజూ స్నానం చేసే అలవాటు ఉన్నవారిలో స్కిన్ బ్యారియర్ బలహీనపడి, అలర్జీలు, ఎగ్జిమా వంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. అందుకే డెర్మటాలజిస్టులు వారంలో రెండు నుండి మూడు సార్లు మాత్రమే పూర్తిగా స్నానం చేయడం ఆరోగ్యానికి ఉత్తమమని సూచిస్తున్నారు. రోజూ స్నానం చేయకపోయినా శరీరం దుర్వాసన రాదు, అలాగే చర్మం తన సహజ తేమను కోల్పోదని స్పష్టం చేస్తున్నారు.
మధ్యలో పరిశుభ్రత కోసం ముఖం, చంకలు, ప్రైవేట్ భాగాలు, పాదాలను మాత్రమే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఎక్కువ వేడి నీటితో స్నానం చేయడం చర్మంపై ఉన్న సహజ నూనెలను మరింతగా తొలగించే అవకాశం ఉంది కాబట్టి దాన్ని నివారించాలి. సబ్బు కూడా శరీరం మొత్తం మీద రాయకుండా, వాసన వచ్చే కొన్ని ప్రత్యేక ప్రాంతాలకే పరిమితం చేయడం మంచిదని సూచిస్తున్నారు. మిగతా ప్రాంతాలకు సాదా నీరు లేదా మైల్డ్ క్లెన్సర్ చాలు. స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ రాయడం ద్వారా చర్మంలో తేమ నిలకడగా ఉంటుంది.
అయితే రోజూ వ్యాయామం చేసే వారు, ఎక్కువగా చెమట పట్టే వారు, ధూళి ఎక్కువగా ఉండే వాతావరణంలో పని చేసే వారు రోజూ స్నానం చేయడం అవసరం. అయినా కూడా సబ్బు వాడకం తగ్గిస్తే చర్మ సమస్యలు తగ్గుతాయని డెర్మటాలజీస్టులు చెబుతున్నారు.
ALSO READ: దేవుళ్ళు అంటే చులకనా.. రాజమౌళిని జైల్లో వేయాలి : ఎమ్మెల్యే రాజాసింగ్





