
క్రైమ్ మిర్రర్, జాతీయం: ఢిల్లీ నగరం మరోసారి కలకలం రేపింది. రెడ్‌ఫోర్ట్ వద్ద పేలుడు సంభవించిన ఘటనకు ఇంకా ఊపిరి పీల్చుకోకముందే, గురువారం ఉదయం సరిగ్గా 9.10 గంటలకు మహిపాల్‌పూర్ ప్రాంతంలోని ప్రసిద్ధ రాడిసన్ హోటల్ సమీపంలో భారీ శబ్ధం నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ అకస్మాత్తుగా వచ్చిన శబ్ధం విన్నవారు అది బాంబు పేలుడేమోనని భయంతో తల్లడిల్లిపోయారు. వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు ఫైర్ సిబ్బందితో కలిసి మూడు ఫైర్ ఇంజన్లను ఘటనాస్థలానికి తరలించారు.
ప్రస్తుతం ఆ ప్రాంతం మొత్తం భద్రతా వలయంలోకి చేరింది. డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్‌లు చేరుకుని ప్రతి మూలను సవివరంగా తనిఖీ చేశాయి. అయినప్పటికీ ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు అక్కడ లభించలేదని పోలీసులు ప్రకటించారు. స్థానికుల భయాన్ని నివారించేందుకు అధికారులు ప్రజలకు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
రాడిసన్ హోటల్ సమీపంలోని రోడ్డుపై వెళ్తున్న ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (DTC) బస్సు వెనుక టైర్ ఆకస్మికంగా పేలడం వల్లే ఆ శబ్ధం వినిపించిందని పోలీసులు నిర్ధారించారు. అయితే ఎర్రకోట పేలుడు ఘటన ఇటీవలే చోటుచేసుకున్న నేపధ్యంలో, ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
దిల్లీ నగరమంతా ప్రస్తుతం హై అలర్ట్‌లో ఉంది. ప్రతి రహదారిపై, చౌరస్తాల వద్ద, సున్నిత ప్రాంతాల్లో సెక్యూరిటీ బలగాలు అప్రమత్తంగా గస్తీ కాస్తున్నాయి. ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తూ పోలీసులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఢిల్లీ ప్రజలు ఈ పరిస్థితుల్లో భయపడకుండా, అధికారుల సూచనలను పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ALSO READ: Crime: మతిస్థిమితం కోల్పోయి భార్యపై కత్తితో దాడి చేసిన వ్యక్తి.. చివరికి





