ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసుకు సంబంధించిన దర్యాప్తు శరవేగంగా కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించిన మరో కీలక నిందితుడిన NIA అధికారులు అరెస్ట్ చేశారు. బాంబు దాడి కేసులో పేలుడుకు పాల్పడిన ఉగ్రవాదితో కలిసి పనిచేసిన ముఖ్య అనుచరుడు జాసిర్ బిలాల్ ను జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్ లో పట్టుకున్నారు. దాడి వ్యూహరచనలో ఇతడు కీలకంగా వ్యవహరించాడని వెల్లడించారు. ఢిల్లీలో పేలుడుకు ఘటనకు ముందు డ్రోన్లను మెరుగుపరచడం, రాకెట్ల తయారీకి అతడు ప్రయత్నం చేసినట్టు అధికారులు వివరించారు. అతడి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకెళ్లారు.
అమీర్ రషీద్ అలీకి 10 రోజుల కస్టడీ
ఢిల్లీ బ్లాస్ట్ ఘటన మాస్టర్ మైండ్ ఉమర్‌కు సహకరించిన మరో నిందితుడు అమీర్ రషీద్ అలీకి కోర్టు 10 రోజుల ఎన్ఐఏ కస్టడీకి అనుమతించింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ పాటియాలా హౌస్ కోర్టు కాంప్లెక్స్ లోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ కోర్టు ముందు హాజరుపరిచారు. అతడిని 10 రోజుల ఎన్ఐఏ కస్టడీకి కోర్టు ఆదేశించింది. ఆ వెంటనే రషీద్‌ను ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించారు అధికారులు. అతడిని కోర్టుకు హాజరుపరిచే సమయంలో కోర్టు కాంప్లెక్స్ చుట్టూ ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మోహరించారు.
ఢిల్లీ బ్లాస్ట్ కేసును దర్యాప్తు చేస్తున్న NIA
ఇక నవంబర్ 10న లాల్‌ఖిలా మెట్రో స్టేషన్ సమీపంలో హ్యుండాయ్ ఐ20 కారులో పేలుడు కారణంగ 15 మంది చనిపోయారు. సుమారు 30 మంది గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ కొనసాగిస్తోంది. అంటు ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ కేసులో ప్రమేయం, మోసం, ఫోర్జరీకి పాల్పడిన ఆరోపణలపై అల్ ఫలాహ్ యూనివర్శిటీ చైర్మన్‌కు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. యూజీసీ, ఎన్ఏఏసీ లేవనెత్తిన ఆందోళనలపై రెండు ఎఫ్ఐఆర్‌లనూ నమోదు చేశారు.
అమిత్ షా మాస్ వార్నింగ్
అటు ఢిల్లీ బ్లాస్ట్ కేసుకు సంబంధించి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీలో పేలుడు ఘటనతో ప్రమేయం ఉన్న ముష్కరులను పాతాళంలో దాగినా వెతికి పట్టుకుంటామని తేల్చి చెప్పారు. చేసిన నేరానికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేసేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందన్నారు.





