జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో మరోసారి ఆపరేషన్ సింధూర్ జరిగే అవకాశం ఉందని చెప్తూనే, ఈ దాడుల వెనుకున్న వారికి వత్తాసు పలికే ప్రయత్నం చేశారు. ఎర్రకోట బాంబు బ్లాస్ వెనుక ఉన్న వైద్యులు.. ఆ మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? దీనికి కారణం ఎవరు? అంటూ ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతుంది. సున్నితమైన విషయంలో తలతిక్క వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
ఉగ్రవాదులను వెనుకేసుకొచ్చేలా వ్యాఖ్యలు
ఢిల్లీ బాంబు పేలుడు, ఫరీదాబాద్‌లో టెర్రర్ నెట్ వర్క్ తో సంబంధం ఉన్న సుమారు 8 మంది డాక్టర్లను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఫరూఖ్ అబ్దుల్లా స్పందించారు. ఢిల్లీలో దాడి కోసం వైద్యులు ఆ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? కారణం ఏమిటి? అనే ప్రశ్నలను బాధ్యులను అడగాలన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రదాడుల నేపథ్యంలో దేశంలో మరో ఆపరేషన్ సిందూర్ లాంటి వ్యవహారం జరగకూడదని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ తో ఒరిగిందేమీ లేదు!
ఆపరేషన్ సిందూర్ తో ఒరిగిందేమీ లేదన్న ఫరూక్.. భారతీయులు 18 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. భారత్, పాక్ తమ సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలంటే అదొక్కటే మార్గమన్నారు. స్నేహితులను మార్చినప్పటికీ, పొరుగువారిని మార్చలేమన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని వాజ్ పేయి చెప్పిన ఈ వ్యాఖ్యలును ఫరూక్ ప్రస్తావించారు.
నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు
అటు ఫరూక్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఉగ్రవాదులకు మద్దతుగా మాట్లాడే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ తో భారత్ సైన్యం సత్తా చాటితే, ఒరిగిందేమీ లేదని చెప్పడం అవివేకం అన్నారు. ఇలాంటి వారి కారణంగానే దేశంలో ఉగ్రవాదం వేళ్లూనుకుంటుందన్నారు. దేశం గురించి తక్కువ చేసి మాట్లాడే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదన్నారు.





