Dead Body Respect Act: రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక చట్టాన్ని తీసుకొచ్చింది. మృతదేహాలను ముందు పెట్టుకుని రాజకీయాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ చట్టాన్ని రూపొందించారు. శవాలను గౌరవించే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు రాజస్థాన్ ప్రభుత్వం తెలిపింది. ఈ కీలక చట్టాన్ని ఆదివారం నుంచి అమలులోకి తీసుకువచ్చింది.
కొత్త చట్టం ఏం చెప్తుందంటే?
అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఈ చట్టం ప్రకారం.. శవంతో నిరసనలు తెలపడం, శవాలను రాజకీయంగా వినియోగించడం లాంటి చర్యలను ప్రభుత్వం క్రిమినల్ నేరాలుగా పరిగణిస్తుంది. మరణించిన వ్యక్తి అంత్యక్రియలను 24 గంటల్లోపు పూర్తిచేయాలి. కుటుంబసభ్యులు రాష్ట్రం వెలుపల ఉండడం లేదా పోస్టుమార్టం రాష్ట్రం వెలుపల జరిగిన సందర్భాల్లో మాత్రమే మినహాయింపు ఉంటుంది. రాజకీయ, సామాజిక ఒత్తిడి కారణంగా కుటుంబసభ్యులు శవాన్ని స్వీకరించకపోతే.. వారిపైనా అధికారులు చర్యలు తీసుకుంటారు. శవంతో నిరసనలు తెలపడం, రోడ్లను దిగ్బంధించడం, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై ఈ చట్టం ప్రకారం గరిష్ఠంగా 5 ఏళ్ల వరకు జైలుశిక్షతో పాటు జరిమానానూ విధించే అవకాశం ఉంది.
విపక్షాల తీవ్ర ఆందోళన
రాజస్థాన్ లో గత కొంతకాలంగా విపక్ష పార్టీలకు చెందిన నాయకులు, ఆయా కారణాలతో చనిపోయిన వ్యక్తుల శవాలను ముందు పెట్టి రాజకీయ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. గత రెండేళ్లుగా ఇలాంటి ఘటనలు పదుల సంఖ్యలో జరిగాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ శవ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం తాజాగా అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. ఇకపై శవ రాజకీయాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అటు ఈ చట్టంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తుందని మండిపడుతున్నాయి.





