తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు జరగనున్నాయని తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తిరిగి గులాబా కండువా కప్పుకోవడానికి సిద్దంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరగా.. వీళ్లలో అరికపూడి గాంధీ, కడియం శ్రీహరి మినహా మిగితావారంతా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో ఇమడలేక జంపింగ్ ఎమ్మెల్యేలు సతమతం అవుతున్నారని తెలుస్తోంది. నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు సహకరించకపోవడంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాంగ్రెస్‌లో తమకు అవమానాలు జరుగుతున్నాయని భావిస్తున్న జంపింగ్ ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యలు కేసీఆర్ తో టచ్ లోకి వెళ్లారని సమాచారం. కేటీఆర్ సన్నిహితులతో ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయాయని.. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా సంక్రాంతి బాంబులు పేలుతాయనే చర్చ జోరుగా సాగుతోంది.
ఇటీవలే ఫార్మూలా ఈ రేస్ కేసులో కేటీఆర్ పై ఏసీబీ కేసు పెట్టగా.. దానం నాగేందర్ మాత్రం కేటీఆర్ కు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అంతేకాదు అసెంబ్లీలో గతంలో దానం చేసిన కామెంట్లు రచ్చ రాజేశాయి. అయితే ఆ సంఘటన తర్వాత కేటీఆర్ ను కలిసి తప్పు జరిగిందని చెప్పారు. దీంతో దానం తిరిగి బీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది