
బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మాగంటి గోపినాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో జూబ్లీహిల్స్ లో రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా అధికార పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నుంచి గెలిస్తే మంత్రిపదవి ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం కేబినెట్ లో హైదరాబాద్ జిల్లా నుంచి ఎవరూ లేరు. దాదాపు 30 లక్షల ఓటర్లు ఉన్న జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై ఆరోపణలు వస్తున్నాయి. దీంతో జూబ్లీహిల్స్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను కేబినెట్ లోకి తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందని తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిస్తే మంత్రి పదవి ఖాయామని కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది. దాంతో ఆశావాహులు ఎవరి దారిలో వారు టిక్కెట్టు దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్, గతంలో ఎంఐఎం నుంచి ఎమ్మెల్యే బరిలో నిలిచి.. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న నవీన్ యాదవ్ పేర్లు రేసులో వినిపించాయి. అయితే అజారుద్దీన్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయడంతో నవీన్ యాదవ్ కు లైన్ క్లియరైందని భావించారు. కాని సడెన్ లో రేసులో కొత్త నేతలు వచ్చారు. ఢిల్లీ స్థాయిలో తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మురళీ గౌడ్, సీఎన్ రెడ్డి, నుమాన్‌లు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దానం, బొంతు పేర్లు పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన దానం నాగేందర్ పై అనర్హత వేటు పడే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో తాను పోటీ చేస్తానంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్ సీన్ లోకి వచ్చారని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జి.వివేక్‌కు దానం సమాచారం ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అటు బొంతు రామ్మోహన్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆశిస్సులు ఉన్నాయని అంటున్నారు. బొంతు సతీమణి శ్రీదేవి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన వారు కావడం ఆయనకు కలిసివచ్చేలా కనిపిస్తోంది. మొత్తంగా దానం ఎంట్రీతో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ రేస్ ఆసక్తికరంగా మారింది.