ఉగ్రరూపం దాల్చిన దిత్వా తుఫాన్ బలహీనపడింది. పొడి చలిగాలులకు తోడు తుఫాన్ పరిసరాల్లో ఉన్న మేఘాలు విచ్ఛిన్నం కావడంతో తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఆదివారం మధ్యాహ్నానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి చేరువగా వచ్చింది. ఆ తరువాత వాతావరణం అనుకూలించకపోవడంతో మధ్యాహ్నం నుంచి జోరు తగ్గింది. తుఫాన్ ఆవరించిన ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి మరింత చేరువై వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణశాఖ తెలిపింది. పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 90, చెన్నైకు దక్షిణ ఆగ్నేయంగా 140 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
బలహీనపడిన దిత్వా తుఫాన్
ఇవాళ ఉదయానికి పుదుచ్చేరికి 20, చెన్నైకు 40 కి.మీ. దూరంలో సముద్రంలోకి రానున్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర దిశ నుంచి తుఫాన్ వైపుగా పొడి చలిగాలులు రావడం, తుఫాన్ పరిసరాల్లో మేఘాలు విచ్ఛిన్నం కావడంతో దాని తీవ్రత తగ్గినట్లు చెప్తున్నారు. తీవ్ర వాయుగుండంవాయుగుండంగా బలహీనపడినా… చెన్నైకు చేరువగా రానున్నందున మేఘాలు ఉత్తర తమిళనాడు, దానికి ఆనుకుని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ వైపుగా రానున్నాయి. దీంతో వర్షాలు పెరగనున్నాయి. రానున్న 24గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు
తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో చల్లని గాలులు మొదలయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ఉత్తర తమిళనాడుకు మరింత చేరువగా రానున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం 8గంటల వరకు కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల వర్షాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా కుంభవృష్టి వర్షాలు, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో అతిభారీ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, నంద్యాల, అనంతపురం జిలాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ, విపత్తుల నిర్వహణ శాఖలు తెలిపాయి. మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని, రైతులు పంటల ఉత్పత్తుల రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణశాఖ సూచించింది. కృష్ణపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, మచిలీపట్నం ఓడరేవుల్లో మూడో నంబరు, కోస్తాలో మిగిలిన రేవుల్లో రెండో నంబరు భద్రతా సూచికలు ఎగురవేశారు.
అటు దిత్వా తుఫాన్ నేపథ్యంలో అధికారులు మరింత అలర్ట్‌గా ఉండాలని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. ఆదివారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి తుఫాన్ పరిస్థితిని మంత్రి సమీక్షించారు. తుఫాన్ ప్రభావం ఉండే నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.





