
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకున్న ఓ దారుణ హత్య కేసు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య జరిగిన గృహ వివాదం చివరకు ఓ మహిళ ప్రాణాలు కోల్పోయే స్థాయికి చేరింది. గ్రామీణ జీవితం వదిలి నగరంలో స్థిరపడాలన్న అంశంపై తలెత్తిన విభేదాలు భర్తలోని క్రూరత్వాన్ని బయటపెట్టాయి. భార్యను తన చేతులతోనే హత్య చేసిన ఈ ఘటన సమాజాన్ని కలచివేస్తోంది.
భోపాల్‌లోని చోళ మందిర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఖేజ్రా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ గ్రామానికి చెందిన హేమరాజ్, కాంచన దంపతులకు ఇది రెండో వివాహం కాగా, దాదాపు 14 నెలల క్రితమే పెళ్లి జరిగింది. మొదట్లో జీవితం సాఫీగానే సాగినా.. కొద్ది నెలలుగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం.
కాంచన గ్రామంలో ఉండడం ఇష్టపడక, భోపాల్ నగరానికి వెళ్లి అక్కడ స్థిరపడాలని భర్తపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. నగర జీవితం మెరుగైన ఉపాధి, సౌకర్యాలు అందిస్తుందని ఆమె భావించగా, హేమరాజ్ మాత్రం గ్రామాన్ని విడిచి వెళ్లేందుకు నిరాకరించాడు. ఈ అంశమే దంపతుల మధ్య తరచూ గొడవలకు దారితీసింది.
ఘటన జరిగిన రోజు కూడా ఇదే విషయంపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాటల తూటాలు కాస్తా చేతులకు దారితీశాయి. ఆగ్రహంతో ఊగిపోయిన హేమరాజ్ తన భార్య కాంచన నోట్లో గుడ్డలు కుక్కి, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళ అరవకుండా ఉండేందుకే నోట్లో గుడ్డలు పెట్టినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఈ దారుణ ఘటనతో ఖేజ్రా గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంట్లో నుంచి ఎలాంటి కదలికలు లేకపోవడంతో పొరుగువారు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కాంచన మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహంపై హింసకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించడంతో ఇది హత్యేనని నిర్ధారించారు.
పోలీసులు వెంటనే హేమరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతడు నేరం చేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. భార్య నగరానికి వెళ్లాలని ఒత్తిడి చేయడంతో కోపం పెరిగి ఈ ఘోరానికి పాల్పడ్డానని నిందితుడు చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్యనా, లేక క్షణికావేశంలో జరిగిన నేరమా అన్న అంశాలపై విచారణ కొనసాగుతోంది. నిందితుడి గత నేపథ్యం, కుటుంబ పరిస్థితులు, రెండో వివాహం తరువాత దంపతుల మధ్య ఉన్న సంబంధాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
ALSO READ: బాలికపై మేనమామ అత్యాచారం.. చివరికి?





