
క్రైమ్ మిర్రర్, మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని వెంకటాపురం (పిటి) గ్రామంలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అంగడి శంకర్ అనే వ్యక్తి గత రెండు రోజులుగా మతిస్థిమితం కోల్పోయి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని స్థానికులు తెలిపారు. ఈ మానసిక అస్థిరత కారణంగా నిన్న అతడు సోదరుడి మనవరాలిపై దారుణంగా దాడి చేసి, ఆమెను బిల్డింగ్ పై నుంచి తోసేసినట్లు సమాచారం. అనంతరం తన భార్యపై కూడా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు తెలిసింది.
భార్య, బాలికను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఉదయం శంకర్ రైలు పట్టాల పక్కన అనుమానాస్పద స్థితిలో మృతదేహంగా కనబడటంతో గ్రామంలో ఒక్కసారిగా సంచలనం చోటుచేసుకుంది. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ప్రమాదవశాత్తు రైలు ఢీ కొట్టిందా అన్నది పోలీసులు విచారిస్తున్నారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
కాగా, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ గత కొద్ది రోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భార్య, బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
ALSO READ: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు!





