
-
పట్టించుకోని ఎల్బీనగర్ మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు
-
మామూల్ల ఆశతో నాణ్యతకు తిలోదకాలు అంటున్న స్థానికులు
ఎల్బీనగర్, క్రైమ్ మిర్రర్ : జిహెచ్ఎంసి నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు నాణ్యతలేమితో బీటలు వారిపోతుండడం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది. ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని హస్తినాపురం డివిజన్, అగ్రికల్చర్ కాలనీలో తాజాగా వేసిన సీసీ రోడ్డు కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే పగుళ్లు పడుతూ బీటలు వారింది. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడమే దీనికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఎలాంటి స్పందన రాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో రోడ్లు వేస్తున్నా, కాంట్రాక్టర్లు ఇచ్చే మామూల్లకు లొంగి అధికారులు నాణ్యత చూడట్లేదు, అని అగ్రికల్చర్ కాలనీ వాసులు మండిపడ్డారు.
స్థానికుల మాటల్లో, రోడ్డు నిర్మాణంలో సిమెంట్ మోతాదు తక్కువగా ఉండటం, మట్టి మిశ్రమం అధికం కావడం, ప్రాపర్ కంపాక్షన్ లేకపోవడం వంటి లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయట.
ఇక రోడ్డు బీటలు వారినా కూడా, అధికారులు బిల్లుల చెల్లింపుల కోసం కొలతలు వేయడం ప్రజల్లో అనుమానాలు రేపుతోంది. దొంగలు దొంగలు కలిసి ఊర్లను పంచుకున్నట్లు ఉంది అని పలువురు స్థానికులు తీవ్రంగా విమర్శించారు. ప్రజల సొమ్ముతో నిర్మిస్తున్న రోడ్లపై ఈ నిర్లక్ష్యం సహించరానిదని, ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి, నాణ్యత పట్టించుకోకుండా పనులు చేసిన కాంట్రాక్టర్‌తో పాటు పర్యవేక్షణలో విఫలమైన ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.