
మీడియా స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్లుగా వార్తలు రాసే మీడియా సంస్థలకు హెచ్చరిక ఇది. కనీస నైతికత లేకుండా వ్యక్తుల పరువుకు భంగం కలిగించే విధంగా వార్తలు ప్రచురించే మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలని జమ్మూ కాశ్మీర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అడ్డగోలుగా వార్తలు రాసి దానికి పత్రికా స్వేచ్ఛ అని పేరు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణ చెప్పినంత మాత్రాన మీరు ప్రచురించిన కథనాల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చగలరా?.. అంటూ మీడియా ఛానల్స్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది జమ్మూ కాశ్మీర్ కోర్టు
జమ్మూ కాశ్మీర్–పూంచ్ లోని భారత్ పాకిస్తాన్ సరిహద్దులో జరిగిన కాల్పుల్లో స్థానిక ఉపాధ్యాయుడు కరి మొహమ్మద్ ఇక్బాల్ మరణించాడు. అయితేఅతను లష్కర్ ఇ తోయిబాకు సంబంధించిన పాకిస్తాన్ ఉగ్రవాది అంటూ వార్తలు ప్రచురించింది జీ5, న్యూస్18 మరియు ఇతర టీవీ ఛానల్స్. దీంతో తప్పుడు వార్తలు ప్రచురించిన ఛానల్స్ పై కేసు నమోదు చేయమని ఇక్బాల్ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, అందుకు నిరాకరించారు పోలీసులు.
పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపి మీడియా పట్ల అసహనం వ్యక్తం చేసింది కోర్టు . పత్రికా స్వేచ్ఛ పేరిట వ్యక్తుల ప్రతిష్ఠకు, మర్యాదకు భంగం కలిగించడం సరికాదని, ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసి క్షమించమని అడిగితే జరిగిన నష్టం పూడ్చలేరని ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. ఒక స్థానిక ఉపాధ్యాయుడిపై టెర్రరిస్ట్ అని ముద్ర వేయడం, సమాజంలో అతనికి ఉన్న పేరు, ప్రఖ్యాతలను దెబ్బ తీసి, దానికి పత్రికా స్వేచ్ఛ అని పేరు పెట్టడం భావ్యం కాదని వ్యాఖ్యానించింది కోర్టు. జీ5, న్యూస్18 తో పాటు ఇతర ఛానెల్స్ ఎడిటర్స్ మరియు యాంకర్స్ పై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పూంచ్ పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం.