
Cosmic Smile: చంద్రుడు నవ్వితే ఎలా ఉంటుంది అనే ఊహకే మనసు ఉల్లాసంగా మారుతుంది. అలాంటి ఊహనే నిజం చేస్తూ నిన్న రాత్రి ఆకాశంలో ఓ అపురూపమైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతమైంది. చంద్రుడు, శని, వరుణ గ్రహాలు ఒకే ప్రాంతంలో సమీపంగా కనిపిస్తూ ఆకాశంలో చిరునవ్వు లాంటి ఆకారాన్ని సృష్టించాయి. ఈ అరుదైన త్రిగ్రహ సంయోగాన్ని ఖగోళ శాస్త్రజ్ఞులు ‘కాస్మిక్ స్మైల్’గా పేర్కొంటున్నారు. ప్రకృతి తన సొంత శైలిలో నవ్వినట్టుగా కనిపించిన ఈ దృశ్యం కోట్లాది మందిని ఆకట్టుకుంది.
సూర్యుడు చుట్టూ గ్రహాలు తమ తమ కక్ష్యల్లో తిరుగుతుంటాయని మనందరికీ తెలుసు. అయితే భూమి మీద నుంచి చూస్తే చంద్రుడు తప్ప మిగతా గ్రహాలు సాధారణంగా కనిపించవు. కొన్ని సందర్భాల్లో మాత్రం శుక్రుడు, గురుడు వంటి గ్రహాలు మానవ కంటికి దర్శనమిస్తాయి. అవి కూడా ఒక్కోసారి ఒక్కో గ్రహంగా మాత్రమే కనిపిస్తాయి. కానీ ఒకేసారి మూడు ఖగోళ వస్తువులు ఒకే సరళిలో, అదీ చిరునవ్వు ఆకారంలో కనిపించడం అత్యంత అరుదైన విషయం.
నిన్న రాత్రి ఇదే అద్భుతం చోటుచేసుకుంది. చంద్రుడు తన అర్థాకార దశలో ఉండగా, దానికి ఇరువైపులా శని, వరుణ గ్రహాలు కనిపించాయి. చంద్రుడి వంపు నవ్విన నోటిలా కనిపించగా, శని, వరుణ గ్రహాలు రెండు కళ్లలా దర్శనమిచ్చాయి. దీంతో ఆకాశంలో ఓ స్మైలీ ఫేస్ రూపుదిద్దుకుంది. ఈ దృశ్యం చూసిన వారు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ ఖగోళ దృశ్యం ఏర్పడటానికి శాస్త్రీయ కారణం ఉంది. ఖగోళ శాస్త్రంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రేఖాంశంలో దగ్గరగా కనిపించే సంఘటనను కాంజంక్షన్ అంటారు. ఇలాంటి కాంజంక్షన్లు సాధారణమే అయినప్పటికీ, ఈసారి ఏర్పడిన త్రిగ్రహ సంయోగం మాత్రం చాలా ప్రత్యేకమైంది. చంద్రుడు శని కంటే కొన్ని డిగ్రీల ఉత్తరంగా వంగి ఉండటం, అదే ప్రాంతంలో వరుణ గ్రహం కూడా కనిపించడం వల్ల ఈ అరుదైన దృశ్యం సాధ్యమైంది.
ఈ కాస్మిక్ స్మైల్ భారత్‌తో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో కనిపించింది. భారత్‌లో ఇప్పటికే రాత్రి సమయం కావడంతో పశ్చిమ ఆకాశంలో సూర్యాస్తమయం తర్వాత ఈ దృశ్యం స్పష్టంగా దర్శనమిచ్చింది. నగరాల వెలుతురు ఉన్నప్పటికీ చంద్రుడు, శని గ్రహాలు కళ్లకు బాగా కనిపించాయి. అయితే వరుణ గ్రహం చాలా దూరంలో ఉండటంతో కొద్దిగా మసగ్గా కనిపించింది. దానిని స్పష్టంగా చూడాలంటే టెలీస్కోప్ అవసరమైంది.
ఈ అపురూప దృశ్యం ఖగోళ శాస్త్రజ్ఞులకే కాకుండా ఫోటోగ్రాఫర్లకు, ఆకాశాన్ని ప్రేమించే వారందరికీ మధురానుభూతిని ఇచ్చింది. సోషల్ మీడియాలో చంద్రుడు నవ్వుతున్నట్లు ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రకృతి సృష్టించిన ఈ ఖగోళ చిరునవ్వు ఎంతోమందికి చిరస్మరణీయ క్షణంగా మిగిలింది.
ఇలాంటి కాస్మిక్ స్మైల్ ఇంతకు ముందు కూడా ఏర్పడింది. గత ఏడాది జూన్ 19న కూడా చంద్రుడు, ఇతర గ్రహాల సంయోగంతో ఆకాశంలో స్మైలీ ఫేస్ లాంటి దృశ్యం కనిపించింది. అయితే ప్రతి సారి ఈ సంయోగం ఒకేలా ఉండదు. గ్రహాల స్థానాలు, కోణాలు మారుతుండటంతో ప్రతి కాస్మిక్ స్మైల్ ప్రత్యేకతను సంతరించుకుంటుంది.
ఆకాశంలో ఇలా గ్రహాలు కలిసి మనకు చిరునవ్వు చూపించడం ప్రకృతి గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తోంది. మన దైనందిన జీవితంలోని ఒత్తిడుల మధ్య, ఆకాశాన్ని ఓసారి తలెత్తి చూసిన వారికి ఈ కాస్మిక్ స్మైల్ ఓ చిన్న ఆనందాన్ని పంచింది.





