
తిరుమల, (క్రైమ్ మిర్రర్): పవిత్ర క్షేత్రమైన తిరుమలలో శాంతి, భద్రతలపై ప్రశ్నలు తలెత్తిస్తున్నాయి. వరుసగా చోటు చేసుకుంటున్న అపచారాల నేపధ్యంలో టీటీడీ నిఘా వ్యవస్థ నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల కళ్యాణ వేదిక సమీపంలోని ఖాళీ ప్రదేశంలో ఓ అన్యమతస్థుడు నమాజ్ చేసిన వీడియో నేడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఓ ముస్లిం వ్యక్తి హజ్రత్ వేషధారణలో అలిపిరి టోల్ గేట్ గుండా తిరుమలలోకి ప్రవేశించిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అంతేకాదు… మద్యం, ఎగ్ బిర్యానీ వంటి నిషేధిత వస్తువులు తిరుమలలోకి స్మగ్లింగ్ చేయబడి సేవించడం, తినడం వంటి సంఘటనలు పలు మార్లు వెలుగుచూశాయి.
భక్తులు శ్రీవారి దర్శనానికి వేలాది కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంటే, తిరుమలలో భద్రతా వ్యవస్థ ఇలా విఫలమవడం బాధాకరమని పలువురు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. డ్రోన్ కలకలం, నిఘా విభాగం స్పందనలో జాప్యం, నిషేధిత వస్తువుల గుట్టలు — ఇవన్నీ కలిపి టీటీడీ భద్రతా వ్యవస్థపై బలమైన అనుమానాలను కలిగిస్తున్నాయి. నిఘా విభాగం మరింత జాగ్రత్తగా వ్యవహరించి తిరుమల పవిత్రతను కాపాడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.