-
మూసీ పేరుతో కాంగ్రెస్ దోపిడీ
-
మురుగు శుద్ది కేంద్రాలపై అశ్రద్ద
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: మూసీ పేరుతో దోచుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. బీఆరఎస్ పాలనలో వికాసం, కాంగ్రెస్ పాలనలో విధ్వంసం కొనసాగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఇటుకను పేర్చనోడికి కూల్చే హక్కులేదని మండిపడ్డారు.
నాగోల్ మూసీ పరీవాహక ప్రాంతంలో బీఆరఎస్ ప్రభుత్వం చేసిన సుందరీకరణ పనులను గురువారం బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు మూసీలోని మురుగు నీరుని శుద్ధి చేయాలని బీఆర్ఎస్ ముందుకెళ్లింది. దేశంలోనే అతిపెద్దది అయిన నాగోల్ ఎస్టీపీని రూ. 4వేలకోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండ్లు కూల్చకండా, భూములు కోల్పోకుండా మూసీని అభివృద్ధి చేశామన్నారు. 2023 డిసెంబర్ వరకు 85 శాతం ఎప్టీపీ నిర్మాణం పూర్తయింది. 15 బ్రిడ్జీలు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసింది. మిగతా పెండింగ్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బంగారుపల్లెంలో పెట్టి కేసీఆర్ తెలంగాణను అప్పగించారు. కాంగ్రెస్ స్వార్ధం కోసం రూ. 16 వేల కోట్ల అయ్యే ప్రాజెక్ట్ వ్యయం పది రెట్లు పెంచి 1.50లక్షల కోట్ల భారీ స్కాంకు తెరతీశారని ఆరోపించారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకంసృష్టిస్తున్నదన్నారు.
రేవంత్ రెడ్డి అన్న తిరుపుతి రెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్ జోన్లో ఉంది అది కూలగొట్టే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ప్రజలను రోడ్డున పడేసి ఏం సాధిస్తారన్నారు. సీఎం రేవంత్, మంత్రులు ఇలా అందరి ఇళ్లు బఫర్ జోన్లో ఉన్నాయి. మహబూబ్నగర్లో దివ్యాంగులు ఇళ్లు కూల్చారు. ఖమ్మంలో పేదల గుడిసెలను బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఇవన్నీ రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రూ.1.50 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ పనులు చేస్తామని సీఎం రేవంత్ చెబుతున్నారు.
రూ.16వేల కోట్లతోనే ఆ పనులను చేయొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించింది హామీల అమలు కోసమేనని గుర్తు చేశారు. రెండున్నరేళ్లలో ఒక్క ఇల్లు నిర్మించినట్లు చూపిస్తే రాజకీయాల నుంచి తప్ప్పుకొంటా. మూసీ సుందరీకరణ పనుల బాధ్యత మాకు అప్పగిస్తే రూ.16వేల కోట్లకే చేసి చూపిస్తాం. ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా అభివృద్ధి చేస్తాం అని కేటీఆర్ అన్నారు. కెటిఆర్ వెంట మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బి నగర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి తదితరులు ఉన్నారు.

