* బీఆర్ఎస్ కు ఊతమిచ్చేలా వ్యాఖ్యలు
* పార్టీ కార్యక్రమాలకు ఎప్పుడూ దూరమే
* ఉద్యమకారులకు అవకాశాల పేరిట ఫైర్
* మంత్రి పదవిపై కన్నేశారన్న అభిప్రాయాలు
రాములమ్మ అలియాస్ విజయశాంతి.. అప్పుడప్పుడు మాత్రమే బాహ్య ప్రపంచంలోకి వచ్చే నాయకురాలు. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం.. ఇంకా మాట్లాడితే పార్టీ మారాలనుకున్నప్పుడే బయటకు రావడం అలవాటైపోయిన నేత. పేరుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నా.. పార్టీ కోసం ఆమె పనిచేసిందిగానీ, చేస్తున్నది గానీ ఏమీలేదు. కానీ, తన అవసరానికి మాత్రం పార్టీ అన్నీ చేసిపెట్టాలనే ధోరణితో విజయశాంతి ఉంటారనే ప్రచారం ఉంది. గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడుగానీ, బీజేపీలోగానీ, ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా ఆమె వైఖరి అలాగే ఉందని అంటుంటారు. ఇదంతా ఒక ఎత్తయితే.. అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉండి.. శాసనమండలిలో సొంత పార్టీ ప్రభుత్వంపైనే ఆరోపణలు చేయడం ద్వారా ప్రజల్లో కొత్త అనుమానాలకు విజయశాంతి అవకాశమిచ్చారు.
ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక హామీలు ఇచ్చామని, వాటిని నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విజయశాంతి ఆరోపించారు. ఉద్యమంలో పాలు పంచుకున్న వారికి న్యాయం చేయాలని.. లేక పోతే.. కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర హీనంగా మిగిలిపోతుందని ఆమె సంచ లన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. 25 వేల రూపాయల పింఛను, ఉద్యోగాలు, భూములు ఇవ్వాలని కూడా సూచించారు. దీనిపై వేసిన కమిటీ కాలయాపన కమిటీగా ఉందన్నారు. ఇలా.. ఉద్యమ కారుల తరఫున మండలిలో పలు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంపై( బీ ఆర్ ఎస్)పైనా విమర్శలు చేసినా.. అవి సునిశితంగా, సున్నితంగా ఉన్నాయన్న వాదన వినిపించింది.
దీంతో విజయశాంతి వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీలో గుసగుస మొదలైంది. ఆమె లేవనెత్తిన అంశాలపై ఎవరూ విభేదించకపోయినా.. ఆమె తీరును మాత్రం కొందరు తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా.. బీఆర్ఎస్ వంటి ప్రత్యర్థి పార్టీలకు ఊతమిచ్చేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని ఓ మంత్రి ఆఫ్ ది రికార్డుగా అన్నారు. ఇదే మాట మరికొందరు కూడా చెబుతున్నారు. గతంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. విజయశాం తి ప్రకటనలకే పరిమితం అయ్యారని అప్పట్లో ఎందుకు ప్రశ్నించలేదని వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేకాదు.. ఇప్పుడు సొంత పార్టీ ప్రభుత్వం ఎన్నో అమలు చేస్తోందని.. కానీ, విజయశాంతికి అవేవీ కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం పింఛన్లు ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. కానీ.. విజయశాంతి ప్రత్యేక ఎజెండా పెట్టుకుని మాట్లాడారని.. ఒక వర్గాన్ని రెచ్చగొట్టే ధోరణి కనిపించిందని మెజారిటీ నాయకులు వ్యాఖ్యానించారు. కానీ, ఆమె కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ ప్రత్యేక శైలిని అవలంభిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రస్థాయి నాయకుల కంటే కూడా ఆమె జాతీయ స్థాయి నాయకులతోనే ఎక్కువగా టచ్‌లో ఉంటున్నారు. అంతేకాదు.. రాష్ట్ర ప్రభుత్వ పనిలోనూ ఆమె భాగస్వామ్యం తక్కువగానే ఉంది. కొన్ని కొన్నిసందర్భాల్లో అసలు లేనే లేదన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే గత రెండు రోజులుగా విజయశాంతి వ్యవహారంపై పార్టీలో చర్చసాగుతోంది.
