జాతీయం

కన్నడ కాంగ్రెస్ లో బీజేపీ ముసలం!

Karnataka Congress Crisis: కర్ణాటక కాంగ్రెస్‌ లోఅంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వర్గీయుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సిద్ధరామయ్య మద్దతుదారుడైన సీనియర్‌ ఎమ్మెల్యే  రాజన్నను మంత్రివర్గం నుంచి తొలగించడం సంచలనంగా మారింది. డీకే శివకుమార్‌ పై రాజన్న మద్దతుదారులు విరుచుకుపడుతున్నారు. రాజన్నను మంత్రి పదవి నుంచి తొలగించడం వెనక డీకే పన్నాగం ఉందని ఆరోపిస్తున్నారు.

సిద్ధరామయ్య వర్సెస్ డీకే  శివకుమార్

కాంగ్రెస్‌  ఓట్‌ చోరీ  ఆరోపణలను బహిరంగంగా ప్రశ్నించిన తర్వాత రాజన్న మంత్రి పదవి నుంచి తొలగించారు. తాజాగా డీకేకు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ, రాజన్న కుమారుడు రాజేంద్ర మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరడంతో పార్టీలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. సెప్టెంబర్‌ విప్లవం గురించి మాట్లాడుతున్న వారంతా చివరికి బీజేపీలో చేరుతారని రాజేంద్ర వ్యాఖ్యానించారు. రాజన్నను నిందిస్తున్న వారంతా బీజేపీలోకి వెళ్తారని, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే బసనగౌడపాటిల్‌ యత్నాల్‌ 20-25 మంది ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకొస్తామని చెప్తున్నారని, అదే జరిగితే సెప్టెంబర్‌ విప్లవం గురించి చెప్పిన మాటలు నిజమవుతాయని అన్నారు. సెప్టెంబర్‌లో ఏం కావాలనుకుంటే అది చేసుకోవచ్చని, అవసరమైతే బ్రెయిన్‌ మ్యాపింగ్‌ కూడా చేయించుకోవచ్చని, ఇప్పటికే కొంతమంది పార్టీ నుంచి ఒక కాలు బయట పెట్టారని డీకేను ఉద్దేశించి అన్నారు. అలాగే రాజన్న అసెంబ్లీలో ఆరెస్సెస్‌ గీతం పాడలేదని, ఆరెస్సెస్‌ క్యాంపునకు వెళ్లేందుకు షార్ట్‌ ధరించలేదని పరోక్షంగా డీకేకి చురకలంటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button