
-
రెండురోజుల క్రితం దామోదర్ గౌడ్ అదృశ్యం
-
సింగోటం రిజర్వాయర్‌లో మృతదేహం గుర్తింపు
-
నాగర్ కర్నూలు జిల్లా కల్వకోల్‌లో ఘటన
-
వివాహేతర సంబంధమే హత్యకు కారణం
క్రైమ్ మిర్రర్, మహబూబ్‌నగర్: తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కర్నాటి దామోదర్‌గౌడ్ (48) దారుణహత్యకు గురయ్యాడు. నాగర్‌కర్నూలు జిల్లా కల్వకోల్‌కు చెందిన దామోదర్‌గౌడ్ రెండురోజుల క్రితం అదృశ్యమయ్యాడు. భార్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు… సింగోటం రిజర్వాయర్‌లో దామోదర్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం గోనెసంచిలో కుక్కి ఉండటంతో మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
అయితే, పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దామోదర్‌కు కల్వకోల్ గ్రామానికే చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సదరు మహిళతో ఏకాంతంగా గడిపేందుకు దామోదర్ వెళ్లాడు. ఆ మహిళతో సన్నిహితంగా ఉన్న సమయంలో ఆమె భర్త, కుమారుడు చూశారు. దీంతో ఆగ్రహం తట్టుకోలేక దామోదర్‌పై దాడి చేశారు. తండ్రీకొడుకుల దాడిలో దామోదర్ అక్కడికక్కడే చనిపోయాడు. శవాన్ని సంచిలో మూటగట్టి సింగోటం రిజర్వాయర్‌లో పడేశారు. రెండురోజుల అనంతరం దామోదర్ డెడ్‌బాడీ నీళ్లలో తేలింది. కాగా, మహిళను, ఆమె భర్తను, కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.