
తెలంగాణలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. యూరియా బస్తాల కోసం అన్నదాతలు రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. మహిళా రైతులు, చిన్న పిల్లలు సైతం రాత్రి వేళ్లలోనూ యూరియా సెంటర్ల దగ్గరే ఉంటున్నారు. ఒక్క యూరియా బస్తా ఇవ్వాలని అధికారుల కాళ్లు పట్టుకుంటున్నారు రైతులు. అయినా వాళ్లకు సరిపడా యూరియా దొరకడం లేదు. కేంద్రం నుంచి యూరియా వస్తున్నా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, లీడర్లు బ్లాక్ అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే బండారం బయటపడింది.
రైతులకు ఇవ్వాల్సిన యూరియాను బ్లాక్‌లో అమ్మి అడ్డంగా దొరికాడు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గన్‌మెన్.
లారీ యూరియా లోడ్‌ను బ్లాక్‌లో అమ్మేశాడు మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్‌మెన్. వ్యవసాయ అధికారికి ఫోన్ చేసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పీఏ అని చెప్పి లారీ యూరియా కావాలన్నారు. దీంతో రోజుల తరబడి లైన్లలో ఉంటున్న అన్నదాతలను వదిలేసి.. ఎమ్మెల్యే చెప్పారంటూ లారీ యూరియాను గన్ మెన్ చెప్పిన చోటుకు పంపించారు వ్యవసాయ శాఖ అధికారులు.ఆ లారీ లోడ్ యూరియాను బ్లాక్‌లో అమ్మేశాడు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గన్‌మెన్ నాగు నాయక్.
లారీ యూరియా కోసం ఎమ్మెల్యే స్వయంగా అధికారులకు ఫోన్ చేయడంతో ఈ బాగోతం బయటపడింది. పది రోజుల క్రితమే లారీ యూరియా మీ కోసం పంపామని అధికారులు చెప్పడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్ అయ్యాడు. ఎక్కడ పోయిందని ఆరా తీయగా గన్ మెన్ వ్యవహారం వెలుగులోనికి వచ్చింది. యూరియా కోసం అరిగోసలు పడుతుంటే పట్టించుకోకుండా.. కాంగ్రెస్ నాయకులు యూరియా బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకొని గన్‌మెన్‌పై విచారణకు ఆదేశించారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఈ ఘటన నల్గొండ జిల్లాలో తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ నేతలపై అన్నదాతులు భగ్గుమంటున్నారు.