
Condom Tax: దేశంలో వేగంగా క్షీణిస్తున్న జనాభా సమస్యను ఎదుర్కొనేందుకు చైనా ప్రభుత్వం కొత్త సంవత్సరంలో కీలక నిర్ణయాలకు తెరతీసింది. దశాబ్దాలుగా అమలు చేసిన కఠిన జనాభా నియంత్రణ విధానాల ఫలితంగా ఎదురవుతున్న జనాభా సంక్షోభాన్ని అధిగమించాలనే లక్ష్యంతో జననాల రేటు పెంచేందుకు కొత్త విధానాలను అమల్లోకి తెచ్చింది. ఈ క్రమంలో కండోమ్స్, గర్భనిరోధక సాధనాలు, సంబంధిత మందులపై భారీగా పన్నులు విధిస్తూ కీలక ప్రకటన చేసింది. నేటి నుంచే ఈ పన్నులు అమల్లోకి వస్తాయని చైనా ప్రభుత్వం స్పష్టం చేసింది.
చైనాలో గతంలో ఒక కుటుంబానికి ఒక బిడ్డ అనే విధానం దశాబ్దాలపాటు అమలులో ఉంది. 1993లో అధికారికంగా ఈ విధానాన్ని అమలు చేసిన ప్రభుత్వం.. అప్పట్లో జనాభా నియంత్రణే ప్రధాన లక్ష్యంగా కండోమ్స్‌పై పన్ను మినహాయింపులు ఇచ్చింది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు దేశాన్ని జనాభా సంక్షోభంలోకి నెట్టిందని చైనా ప్రభుత్వ వర్గాలు అంగీకరిస్తున్నాయి.
గడిచిన మూడేళ్లుగా చైనాలో జననాల రేటు నిరంతరంగా తగ్గుతోంది. పదేళ్ల క్రితం ఏడాదికి సగటున 1.88 కోట్ల జననాలు నమోదు కాగా, గత ఏడాది ఈ సంఖ్య 95.4 లక్షల వరకు పడిపోయింది. ఈ పరిస్థితి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసింది. దీంతో జనాభా వృద్ధిని ప్రోత్సహించేందుకు పలు ఆర్థిక, సామాజిక సంస్కరణలను అమలు చేయాలని నిర్ణయించింది.
ఈ మార్పుల్లో భాగంగా 2026 నుంచి కండోమ్స్, గర్భనిరోధక పరికరాలు, సంబంధిత ఔషధాలపై పన్నులు పెంచనున్నట్లు చైనా ప్రభుత్వం ఇప్పటికే 2025 డిసెంబరులోనే ప్రకటించింది. ఆ ప్రకటన ప్రకారమే నేటి నుంచి ఈ వస్తువుల ధరలు పెరిగాయి. ఇది యువ జంటలను పిల్లలు కనడానికి ప్రోత్సహించే దిశగా తీసుకున్న కీలక అడుగుగా ప్రభుత్వం చెబుతోంది.
అదే సమయంలో కాబోయే తల్లిదండ్రులకు ఊరటనిచ్చే చర్యలపైనా దృష్టి పెట్టింది. చైల్డ్ కేర్ సేవలు, వృద్ధుల సంరక్షణ కేంద్రాలు, వికలాంగుల సేవలు, వివాహ సంబంధిత సేవలపై పన్ను మినహాయింపులు ప్రకటించింది. ఈ చర్యల ద్వారా కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించి, పిల్లలు కనాలనే ఆలోచనను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇవే కాకుండా ప్రసూతి సెలవులను పెంచడం, అవసరం లేని అబార్షన్లను తగ్గించడం, తల్లి శిశు ఆరోగ్య సేవలను మెరుగుపరచడం వంటి అంశాలపై కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. జనాభా వృద్ధి కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదని, సామాజిక బాధ్యతగా కూడా చూడాలని ప్రభుత్వం సూచిస్తోంది.
అయితే మరోవైపు చైనీయులు పిల్లలు కనడానికి భయపడుతున్నారనే వాస్తవాన్ని ప్రభుత్వం ఎదుర్కొంటోంది. దీనికి ప్రధాన కారణం పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చే. ప్రపంచంలోనే పిల్లల పెంపకం అత్యంత ఖరీదైన దేశాల్లో చైనా ఒకటిగా నిలుస్తోంది.
నిపుణుల అంచనాల ప్రకారం.. ఒక బిడ్డను పుట్టిన నాటి నుంచి 18 ఏళ్ల వయస్సు వరకు పెంచేందుకు సగటున 76 వేల డాలర్లు ఖర్చవుతోంది. భారతీయ కరెన్సీలో ఇది దాదాపు 68 లక్షల రూపాయలకు సమానం. విద్య, ఆరోగ్యం, నివాసం, ఇతర అవసరాల ఖర్చులు యువతను పిల్లలు కనాలనే ఆలోచన నుంచి దూరం చేస్తున్నాయి. ఈ మానసిక భయాన్ని తగ్గించేందుకే ప్రభుత్వం కొత్త విధానాలను తీసుకొస్తోంది.
కండోమ్స్ పై పన్ను విధింపుతో మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. అదే హెచ్ఐవీ మరియు ఇతర లైంగిక వ్యాధుల వ్యాప్తి భయం. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ, చైనాలో మాత్రం గత 20 ఏళ్లతో పోలిస్తే హెచ్ఐవీ కేసుల సంఖ్య పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ తరుణంలో కండోమ్స్ ధరలు పెరగడం వల్ల ప్రజలు వాటి వినియోగాన్ని తగ్గిస్తే, హెచ్ఐవీ వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనాభా వృద్ధి లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందా అనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.
ఒకవైపు జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రయత్నాలు, మరోవైపు ప్రజారోగ్య భద్రతపై ఆందోళనలు చైనాను సంక్లిష్ట పరిస్థితిలోకి నెట్టాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు ఎంతవరకు ఫలిస్తాయో, జననాల రేటు నిజంగా పెరుగుతుందో, లేక కొత్త సమస్యలకు దారి తీస్తుందో అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.
ఇప్పుడు చైనా ముందు ఉన్న అసలు సవాల్ ఒక్కటే. జనాభా పెరుగుదలతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు, ఆరోగ్యం, ఆర్థిక భద్రతను సమతుల్యం చేయగల విధానాలను అమలు చేయడం. ఈ సమతుల్యత సాధించగలిగితేనే చైనా జనాభా సంక్షోభం నుంచి బయటపడే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: Prank Death: ప్రాంక్ చేద్దామనుకున్నాడు.. ప్రాణాలు పోయాయి!





