కార్పొరేట్ కంపెనీల కఠిన నిబంధనలు కొన్ని సందర్భాల్లో ఉద్యోగుల ప్రాణాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని మరోసారి నిరూపించిన హృదయ విదారక ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గర్భిణీ అనే పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం నిరాకరించిన కారణంగా ఒక ప్రైవేటు కంపెనీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గర్భిణీ ఉద్యోగినికి వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం ఇవ్వనందుకు సదరు కంపెనీకి కోట్ల రూపాయల జరిమానా విధించడంతో ఈ కేసు అంతర్జాతీయంగా చర్చకు దారి తీసింది.
వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన చెల్సియా వాల్ష్ అనే మహిళ ఓ లాజిస్టిక్స్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తుండేది. గర్భం దాల్చిన సమయంలో ఆమెకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్యులు ఇంటి నుండే పని చేయాలని స్పష్టంగా సూచించారు. ఈ నేపథ్యంలో ఆమె తన పరిస్థితిని వివరించి, మెడికల్ సర్టిఫికెట్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇవ్వాలని యాజమాన్యాన్ని అభ్యర్థించింది. అయితే కంపెనీ యాజమాన్యం ఆమె అభ్యర్థనను పట్టించుకోకుండా, తప్పనిసరిగా కార్యాలయానికి వచ్చి పని చేయాలని లేదా సెలవు తీసుకోవాలని ఒత్తిడి చేసింది.
ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉద్యోగం కోల్పోతామనే భయంతో ఆమె ఆఫీసుకు వెళ్లక తప్పలేదు. కానీ రోజువారీ ప్రయాణాలు, పని ఒత్తిడి కారణంగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. చివరికి గర్భధారణ ఐదవ నెలలోనే ఆమెకు ప్రసవం జరగగా, పుట్టిన శిశువు గంటన్నరలోనే ప్రాణాలు కోల్పోయింది. అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే.. అదే రోజున కంపెనీ యాజమాన్యం ఆమెకు ఇకపై ఇంటి నుండే పని చేయవచ్చని సమాచారం ఇచ్చింది. కానీ అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది.
ఈ ఘటనపై చెల్సియా వాల్ష్ కోర్టును ఆశ్రయించగా, సుదీర్ఘ విచారణ అనంతరం జ్యూరీ కీలక తీర్పు వెలువరించింది. ఉద్యోగి వైద్య అత్యవసర పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా తగిన సౌకర్యాలు కల్పించడంలో కంపెనీ విఫలమైందని తేల్చింది. దీంతో సదరు కంపెనీకి సుమారు రూ.187 కోట్లు అంటే 22.5 మిలియన్ డాలర్ల జరిమానా విధించబడింది. ఈ తీర్పు కార్పొరేట్ రంగానికి గట్టి హెచ్చరికగా మారింది.
ALSO READ: ఇంధన సంక్షోభంపై ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
