
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఓ ఘోర ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సహజీవనం పేరుతో కలిసి ఉంటున్న ఓ మహిళను ఆమె ప్రియుడే అత్యంత క్రూరంగా హత్య చేసి, ఆ నేరాన్ని దాచిపెట్టేందుకు ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టిన దారుణం ఆలస్యంగా బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్‌కు చెందిన రేష్మ అనే మహిళ కొంతకాలంగా గోరేలాల్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అయితే వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు స్థానికంగా తెలిసింది. ఈ క్రమంలో 6 నెలల క్రితం ఇద్దరి మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
రేష్మ అకస్మాత్తుగా కనిపించకపోవడంతో ఆమె కుమారుడు బబ్లు అనుమానం వ్యక్తం చేశాడు. తల్లి ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు గోరేలాల్ నివాసంపై నిఘా పెట్టి, విచారణను లోతుగా చేపట్టారు. విచారణ సమయంలో గోరేలాల్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో ఇంటి ప్రాంగణంలో తవ్వకాలు జరిపారు. తవ్వకాల్లో భూమిలో పాతిపెట్టిన మహిళా అస్థిపంజరం బయటపడింది. ఇది రేష్మదేనని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు.
6 నెలల క్రితమే హత్య జరిగినప్పటికీ నిందితుడు ఎలాంటి ఆధారాలు బయటపడకుండా ఉండేందుకు మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టడం పోలీసులను కూడా షాక్‌కు గురి చేసింది. అస్థిపంజరాన్ని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిన పోలీసులు.. మరిన్ని సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
పోలీసులు గోరేలాల్‌ను అదుపులోకి తీసుకుని, హత్యకు గల అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆస్తి వివాదమా, వ్యక్తిగత విభేదాలా, లేక మరేదైనా కారణమా అన్న కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఈ కేసులో మరెవరైనా పాత్ర ఉందా అనే అంశంపైనా పోలీసులు దృష్టి సారించారు. రేష్మ కుమారుడి ఫిర్యాదు వల్లే ఈ హత్య వెలుగులోకి రావడంతో, పోలీసులు అతడి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.
ALSO READ: GOOD NEWS: ఈ రోజు వీరు పట్టిందల్లా బంగారమే!





