మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయినిలో అరుదైన సంఘటన జరిగింది. డాక్టర్ల బృందం గాయపడ్డ నాగుపాముకు సర్జరీ చేశారు. ఇందుకోసం ఏకంగా 2 గంటల పాటు కష్టపడ్డారు. పాముకు ఏకంగా 80 కుట్లు వేశారు. ప్రాము ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
తాజాగా ఉజ్జయినిలోని విక్రమ్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో భవన నిర్మాణం కోసం తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ పాము జేసీబీ తగిలి తీవ్రగాయాల పాలైంది. రక్తం కారసాగింది. గాయాల బాధ తట్టుకోలేక ఆ పాము అటు, ఇటు తిరగసాగింది. తలకు మరింత పెద్ద గాయం అయింది. దాన్ని చూసిన కొంతమంది మట్టితో కొట్టారు. పాపం ఆ పాము అల్లాడిపోయింది.
హాస్పిటల్ కు తీసుకెళ్లిన స్నేక్ లవర్స్
ఆ తర్వాత స్నేక్ లవర్స్ రాహుల్, ముకుల్‌కు విషయం తెలిసి వెంటనే స్పాట్ కు వెళ్లారు. ఎంతో జాగ్రత్తగా గాయపడ్డ పామును పట్టుకున్నారు. దాన్ని వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చీఫ్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ ముకేష్ జైన్, అతడి టీమ్ పాము తలపై లోతైన గాయం అయినట్లు, ఓ చోట చర్మం పూర్తిగా ఊడిపోయినట్లు గుర్తించారు.సర్జరీ చేయకపోతే పాము చచ్చిపోతుందని భావించారు.
2 గంటల పాటు ఆపరేషన్, 80 కుట్లు
పాముకు తక్కువ మోతాదులో అనస్తీషియా ఇచ్చి ఆపరేషన్ మొదలెట్టారు. దాదాపు 2 గంటల పాటు కష్టపడి ఊడిపోయిన పాము చర్మాన్ని సెట్ చేశారు. ఇందుకోస ఏకంగా 80 కుట్లు వేశారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. పాము ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. రెండు, మూడు రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచిన తర్వాత అడవిలో వదిలిపెట్టనున్నారు. ఆ నాగుపాము ఎలపిడి ఫ్యామిలీకి చెందినట్లు డాక్టర్ జైన్ తెలిపారు.





