
బీఆర్‌ఎస్‌లో అసలు ఏం జరుగుతోంది…? సీఎం నినాదాల గోల ఏంటి..? కేసీఆర్ కూడా విసుక్కునేలా నినాదాలు హోరెత్తిస్తున్నది ఎవరు..? ఇదంతా కేటీఆర్, కవిత అనుచరుల పనేనా…? గులాబీ పార్టీలో గుబులు రేపుతున్న.. సీఎం నినాదాలు. ఎవరి వైపు ఉండాలో తెలియక పార్టీ కేడర్‌లో అయోమయ పరిస్థితి.
సీఎం.. సీఎం.. సీఎం… ఈ నినాదాలు… ముఖ్యమంత్రి రేసులో ఉన్నవారికి, ముఖ్యమంత్రి కావాలనే ఆశపడేవారికి.. వినడానికి వినసొంపుగా ఉంటాయి. కొంత మంది నాయకులు కావాలనే అలా నినాదాలు చేయించుకుంటారు కూడా. కానీ.. బీఆర్‌ఎస్‌లో పరిస్థితి వేరు. సీఎం సీఎం అంటూ చేస్తున్న నినాదాలు… కేసీఆర్‌కు కొత్త తలనొప్పి తెచ్చిపెడుతున్నాయట. అసలు ఎవరు ఈ నినాదాలు చేస్తున్నారు..? ఎందుకు చేస్తున్నారు…? అన్నది కూడా తేల్చుకోలేకపోతున్నారట గులాబీ బాస్. అసలు ఆ పార్టీలో ఏం జరిగిందంటే.
బీఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొన్నా లేదా కవిత పాల్గొన్నా… సీఎం సీఎం అంటూ నినాదాలు హోరెత్తిస్తున్నారట. అయితే.. కేటీఆర్ గానీ, కవిత గానీ.. ఆ నినాదాలు చేసేవారికి కనీసం వారించడంలేదు. అది అటుంచితే…. బీఆర్‌ఎస్ భవన్‌లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నప్పుడు కూడా సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు మార్మోగాయి. దీంతో గులాబీ బాస్.. వారిపై కాస్త అసహనం వ్యక్తం చేశారు కూడా. ఒర్లకండిరా బాబూ అంటూ వారిని వారించే ప్రయత్నం చేశారు కేసీఆర్. అయితే… ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కేసీఆరే కాదు కేటీఆర్, కవిత సభల్లో కూడా సీఎం నినాదాలు మార్మోగడం. దీంతో… కారు పార్టీలో ఏం జరుగుతోందన్న కన్ఫ్యూజన్ నెలకొంది. తాము ఎవరి వైపు ఉండాలో కూడా కేడర్‌కు అర్థం కాని పరిస్థితి.
Also Read : వెంకట్ రెడ్డి, కొండా, జూపల్లి అవుట్? కొత్తగా ఆరుగురికి అవకాశం!
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోంది. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లు సమయం ఉంది. మరి… బీఆర్‌ఎస్‌లో ఇప్పటి నుంచే సీఎం నినాదాలు ఎందుకో అర్థం కావడంలేదు. ఎక్కడ తేడా కొడుతోందని గులాబీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నారట. కేసీఆర్ తర్వాత సీఎం తామే అని చెప్పుకునేందుకు… కేటీఆర్, కవిత ప్రయత్నిస్తున్నారా..? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అంటే.. కల్వకుంట్ల కుటుంబంలో అప్పుడే… పొలిటికల్ వార్ మొదలైందన్న అన్న చర్చ కూడా జరుగుతోంది.