
CM Stalin: బిహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారాయి. ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో ఎన్డీయే కూటమి ఘనవిజయాన్ని అందుకుంది. మొత్తం 245 స్థానాలకు జరిగిన పోటీలో ఎన్డీయే 202 స్థానాలను గెలుచుకుని తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. మరోవైపు మహాగఠ్‌బంధన్ కూటమి కేవలం 34 స్థానాలకే పరిమితమవ్వడం ప్రతిపక్షానికి తీవ్ర వైఫల్యంగా నిలిచింది. ఈ ఫలితాలు వెలువడిన వెంటనే ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా ఇండియా కూటమి లోపాలు, బలహీనతలు బహిర్గతమయ్యాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషించగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో ఎన్డీయే సాధించిన నిర్ణయాత్మక విజయానికి సీఎం నీతీశ్‌కుమార్‌ను ఆయన అభినందించారు. అలాగే ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ నిరంతరం శ్రమించి పోరాడిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు ఈసారి చాలా ముఖ్యమైన మేసేజ్ ఇచ్చాయని, ప్రజలు సంక్షేమ కార్యక్రమాల పట్ల చూపే నమ్మకం, సామాజిక సమీకరణాలు, సైద్ధాంతిక స్పష్టత, స్థిరమైన ప్రచారం వంటి అంశాలపై విజయం, ఓటమి ఆధారపడి ఉంటాయని స్టాలిన్ స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో అనుభవజ్ఞులైన నాయకులు ఉన్నప్పటికీ సమన్వయం, వ్యూహాత్మక దూరదృష్టి, ప్రతి రాష్ట్రానికి సరిపోయే విధానాలను రూపొందించడం వంటి అంశాల్లో ఇంకా మెరుగుదల అవసరమని ఆయన సందేశం ఇచ్చినట్లయింది.
ఈ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం మీద వచ్చిన ఆరోపణలను కూడా స్టాలిన్ ప్రస్తావించారు. బిహార్ ఫలితాల్లో ఈసీ పాత్రపై వచ్చిన విమర్శలను పూర్తిగా కొట్టిపారేయలేమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం అనేది ప్రజాస్వామ్యానికి మూలస్తంభం కావడంతో అది ప్రతిపక్ష అభ్యర్థులకూ నమ్మకాన్ని కలిగించేలా ఉండాలని తెలిపారు. ఇటీవల కాలంలో ఈసీ ప్రతిష్ట దెబ్బతిన్నట్లు అనిపిస్తున్నదనీ, పారదర్శకతను పెంచడం అత్యవసరమని పేర్కొన్నారు.
ఈ ఎన్నికలు రెండు దశల్లో పూర్తయ్యాయి. ప్రచారంలోనూ, పోటీలోనూ, కూటముల్లోనూ ఎన్నో రాజకీయ పరిణామాలు జరిగినా.. చివరకు ఓటర్లు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశారు. ఎన్డీయే పక్షాన వచ్చిన భారీ మెజారిటీ జాతీయ రాజకీయాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహాగఠ్‌బంధన్ కూటమి తక్కువ స్థానాలకే పరిమితమవ్వడం వారి వ్యూహాల్లో కీలక మార్పులు అవసరం ఉన్నాయనే సంకేతాన్ని ఇస్తోంది. ఇకపై ఇండియా కూటమి ఎదుర్కోవాల్సిన సవాళ్లు మరింత పెద్దవిగా మారినందున, స్టాలిన్ సూచించినట్లుగా కొత్త పరిస్థితులకు సరిపోయే వ్యూహాలను సిద్ధం చేసుకోవడం ప్రతిపక్షానికి అత్యంత అవసరమైంది.
ALSO READ: జమ్ముకశ్మీర్ పేలుడు ఘటన.. ఊహాగానాలు వద్దన్న డీజీపీ నలిన్ ప్రభాత్





