తెలంగాణరాజకీయం

సీఎం రేవంత్ రెడ్డి మామకు షాక్

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనన్న సామెతను మరోసారి నిజం చేసిన సంఘటన ఇది. పదవి ఎంత ఉన్నా..

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనన్న సామెతను మరోసారి నిజం చేసిన సంఘటన ఇది. పదవి ఎంత ఉన్నా.. బంధం ఎంత దగ్గరగా ఉన్నా చట్టం ముందు ప్రతి ఒక్కరూ సాధారణ వినియోగదారులేనని స్పష్టంగా నిరూపితమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వయానా మామ అయిన సూదిని పద్మారెడ్డి కూడా ఇన్సూరెన్స్ విషయంలో ఎదురైన అన్యాయంపై వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇన్సూరెన్స్ కంపెనీల వ్యవహార శైలిపై మరోసారి చర్చకు తెరలేపిన ఘటనగా ఇది మారింది.

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలో నివసించే సూదిని పద్మారెడ్డి గత ఏడాది మే 13న గుండెనొప్పితో మెడికవర్ ఆస్పత్రిలో చేరారు. అత్యవసర చికిత్స అవసరం కావడంతో వైద్యులు తక్షణమే చికిత్స అందించారు. ఈ చికిత్సకు గాను మొత్తం రూ.23.50 లక్షల వరకు ఖర్చు అయింది. ఆ మొత్తాన్ని స్వయంగా చెల్లించిన పద్మారెడ్డి.. తన వద్ద ఉన్న నివా బూపా ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం క్లెయిమ్ దాఖలు చేశారు.

గత ఐదేళ్లుగా క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లిస్తూ రూ.20 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూవల్ చేసుకుంటున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్నతనంలోనే, అంటే మూడో ఏట నుంచే పోస్ట్ పోలియో పెరాలసిస్‌తో బాధపడుతున్నానని, ఈ విషయం పాలసీ తీసుకునే సమయంలోనే కంపెనీకి స్పష్టంగా తెలిసినదేనని ఆయన వాదించారు. అప్పట్లో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయని కంపెనీ, చికిత్స పూర్తయ్యాక క్లెయిమ్ దాఖలు చేసిన దశలో మాత్రం అదే కారణాన్ని చూపుతూ తిరస్కరించడాన్ని ఆయన తప్పుబట్టారు.

ఈ వ్యవహారంపై నివా బూపా ఇన్సూరెన్స్ కంపెనీ తీరును ప్రశ్నిస్తూ పద్మారెడ్డి హైదరాబాద్ రెండో వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి మామ అయినప్పటికీ.. తానూ ఒక సాధారణ వినియోగదారుడినేనని, చట్టబద్ధమైన హక్కుల కోసమే కమిషన్‌ను ఆశ్రయించానని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన సామాన్య ప్రజల్లో కూడా పెద్ద చర్చకు దారితీసింది.

స్వయానా ముఖ్యమంత్రి మామకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. సామాన్య వినియోగదారుల పరిస్థితి ఏమై ఉంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే సమయంలో అన్ని వివరాలు తెలుసుకుని ప్రీమియంలు వసూలు చేసే కంపెనీలు, క్లెయిమ్ సమయంలో మాత్రం సహేతుకం కాని కారణాలతో తిరస్కరణలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. వినియోగదారులు న్యాయం కోసం కమిషన్‌లను ఆశ్రయించాల్సిన పరిస్థితి రోజురోజుకీ పెరుగుతోంది.

వినియోగదారుల కమిషన్‌లు అనేక సందర్భాల్లో వినియోగదారులకు అనుకూలంగా తీర్పులు ఇస్తున్నా.. వాటి అమలు విషయంలో మాత్రం సమస్యలు తలెత్తుతున్నాయి. అప్పీలు, పై అప్పీలు అంటూ ఇన్సూరెన్స్ కంపెనీలు కాలయాపన చేయడం సర్వసాధారణంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. తీర్పు అమలుకు కమిషన్ జారీ చేసే వారంట్లను కూడా పోలీసు యంత్రాంగం సకాలంలో అమలు చేయకపోవడం మరో అడ్డంకిగా మారుతోందని వినియోగదారుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఉన్నత హోదాల్లో పనిచేసిన అధికారులు సైతం వినియోగదారులుగా కమిషన్‌లను ఆశ్రయించిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ పూర్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శాంతికుమారి, సివిల్ సప్లయ్స్ కమిషనర్‌గా పని చేసిన డీఎస్ చౌహాన్ కూడా వినియోగదారుల కమిషన్‌లను ఆశ్రయించాల్సి వచ్చింది. శాంతికుమారి మార్నింగ్ వాక్ కోసం కొనుగోలు చేసిన షూస్ విషయంలో హైదరాబాద్ వన్ వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేయగా, డీఎస్ చౌహాన్ పోలీసు అధికారి హోదాలో కొనుగోలు చేసిన బోస్ కంపెనీ బ్లూటూత్ పనిచేయకపోవడంతో హైదరాబాద్ టూ కమిషన్‌ను ఆశ్రయించారు.

ఈ సంఘటనలన్నీ ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. పదవి, హోదా ఎంత ఉన్నా వినియోగదారుడిగా హక్కుల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి దేశంలో ఇంకా కొనసాగుతూనే ఉందని. ఇన్సూరెన్స్ కంపెనీల బాధ్యతాయుతమైన వ్యవహారం, వినియోగదారుల కమిషన్ తీర్పుల సమర్థవంతమైన అమలే ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ALSO READ: Telangana weather: వణికిస్తున్న చలి.. ఈ జిల్లాలకు అలర్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button